Nidhhi Agerwal: సినీ నటి నిధి అగర్వాల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనాన్ని వాడారంటూ ఇటీవల కొన్ని వార్తా సంస్థల్లో వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె తన సోషల్ మీడియాలో స్పందిస్తూ ఆరోపణలను ఖండించారు. తాను భీమవరంలో ఒక స్టోర్ ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు, ఆ కార్యక్రమ నిర్వాహకులే తనకు ప్రయాణ సౌకర్యాలు కల్పించారని ఆమె వివరించారు.
నిధి అగర్వాల్ ఒక లేఖలో ఈ విధంగా రాశారు:
“నేను ఇటీవల భీమవరంలో ఒక స్టోర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా నా కారు గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అక్కడ నాకు ప్రయాణ సౌకర్యాలను స్థానిక నిర్వాహకులే ఏర్పాటు చేశారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహనం అయి ఉండవచ్చు, కానీ నేను ఆ వాహనం కావాలని అడగలేదు. అలాగే, ఏ ప్రభుత్వ అధికారి కూడా నాకు ఈ వాహనాన్ని పంపలేదు. కొన్ని వార్తా సంస్థల్లో వచ్చిన వార్తలన్నీ నిరాధారమైనవి. ఈ విషయంపై నా అభిమానులకు నిజం చెప్పడానికే ఈ స్పష్టత ఇస్తున్నాను. నాకు నా అభిమానుల నుండి లభిస్తున్న ప్రేమకు, మద్దతుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.”
ఈ లేఖతో నిధి అగర్వాల్ తనపై వచ్చిన ఆరోపణలకు పూర్తి వివరణ ఇచ్చారు. ఆమె ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కోరలేదని, అంతా స్థానిక నిర్వాహకుల ఏర్పాటే అని స్పష్టం చేశారు.