Noida: గ్రేటర్ నోయిడాలోని సిర్సా గ్రామంలో వరకట్నం వేధింపులకు గురై ఓ వివాహిత దారుణంగా హత్యకు గురైంది. బాధితురాలిని నిక్కీ (వయస్సు 26)గా గుర్తించారు. రకట్నం కోసం నిక్కీని ఆమె భర్త, అత్తమామలు దారుణంగా హింసించి, నిప్పంటించారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. నిక్కీ అక్క కాంచన్ ఫిర్యాదు మేరకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివాహ సమయంలో కారు, ఇతర విలువైన వస్తువులు ఇచ్చినా, అదనంగా రూ.36 లక్షలు ఇవ్వాలని నిక్కీని ఆమె అత్తమామలు, భర్త వేధించారని కాంచన్ ఆరోపించారు. ఈ దారుణాన్ని నిక్కీ ఆరేళ్ల కుమారుడు కళ్లారా చూశాడు. “వాళ్లు అమ్మపై ఏదో పోసి, చెంప పగలగొట్టి, ఆ తర్వాత లైటర్ తో నిప్పంటించారు” అని ఆ కుమారుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Medchal: మేడ్చల్‌లో దారుణం.. భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసిన భర్త
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి, ఇందులో నిక్కీని ఆమె భర్త, అత్తమామలు కొట్టి, జుట్టు పట్టుకుని లాగుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ కేసులో నిక్కీ భర్త విపిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అతడి సోదరుడు, తల్లిదండ్రులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారు. కాస్నా పోలీస్ స్టేషన్‌లో నిందితులపై హత్య, నేరపూరిత కుట్ర వంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది. నిక్కీని తీవ్ర గాయాలతో సమీపంలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించగా, ఆమెను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే, ఆమె మార్గమధ్యంలోనే మృతి చెందింది. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిక్కీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజలు పోలీస్ స్టేషన్ ముందు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వరకట్న వేధింపుల కేసుల సంఖ్య ఇంకా ఆందోళనకరంగా ఉన్న విషయాన్ని ఈ సంఘటన మరోసారి వెల్లడించింది.