వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ నికోలస్ పూరన్ ప్రపంచ రికార్డు సృస్టించాడు. ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్–2024(సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న పూరన్.. టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. శుక్రవారం బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్ 15 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ తో 27 పరుగులు చేశాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పూరన్ నిలిచాడు.
నికోలస్ పూరన్.. ఈ సంవత్సరం 66 టీ20 మ్యాచ్‌లలో 42.02 సగటు, 160.85 స్ట్రైక్ రేట్ తో 2,059 పరుగులు చేశాడు. అత్యుత్తమ స్కోరు 98. ఈ సంవత్సరంలో పూరన్ ఇప్పటివరకు మొత్తం14 అర్ధ సెంచరీలు సాధించాడు. CPL 2024లో, పూరన్ తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 39.00 సగటు, 175.28 స్ట్రైక్ రేట్ తో 97 బెస్ట్ స్కోర్‌తో 312 పరుగులు చేశాడు. ఈ మెగా టోర్నీలో రెండు అర్ధ సెంచరీలు సాధించిన పూరన్.. అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా ఉన్నాడు. కాగా, 2021లో 48 టీ20ల్లో 56.60 సగటుతో రిజ్వాన్ 2,036 పరుగులు చేశాడు. ఒక ఏడాది అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో పూరన్, రిజ్వాన్ తర్వాత అలెక్స్ హేల్స్( 61 ఇన్నింగ్స్‌లలో 1,946 పరుగులు), జోస్ బట్లర్(-55 ఇన్నింగ్స్‌లలో 1,833 పరుగులు)లు ఉన్నారు.

