Delhi Blast Case: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు (Delhi Car Bomb Blast) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న ‘వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్’ (White Collar Terror Module)కు సంబంధించిన కీలక నిందితుల కోసం సోమవారం జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది.
8 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు
జమ్ము కశ్మీర్ పోలీసుల సహకారంతో ఎన్‌ఐఏ అధికారులు పుల్వామా, షోపియాన్, కుల్గాం జిల్లాల్లోని దాదాపు ఎనిమిది ప్రదేశాలలో దాడులు చేపట్టారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (Jaish-e-Mohammad)కు చెందిన అంతర్రాష్ట్ర ‘వైట్-కాలర్ మాడ్యూల్’ కుట్రను ఛేదించే క్రమంలో ఈ తనిఖీలు కీలకంగా మారాయి.
ఈ మాడ్యూల్‌కు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ వాగే నివాసంలోనూ ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఢిల్లీ పేలుడు కేసులో వాగేను గత నెలలోనే అరెస్టు చేయడం జరిగింది. ఇతని ఇంట్లో కీలక పత్రాలు లభించినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: GHMC: జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాల్టీల విలీనం.. నేడు అధికారికంగా ఆర్డినెన్స్ విడుదల
నవంబర్ 10న ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ కారు పేలుడు ఘటనలో కీలక కుట్రదారుల్లో ఒకరిగా గుర్తించిన జాసిర్ బిలాల్ వనీ ఇంట్లోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. డానీష్ అలియాస్ జాసిర్ బిలాల్ వనీ ఈ మాడ్యూల్‌కు సాంకేతిక వెన్నెముకగా పనిచేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
డ్రోన్ దాడికి భారీ ప్లాన్!
నిందితుడు జాసిర్ బిలాల్ వనీ, పుల్వామాకు చెందిన 28 ఏళ్ల వైద్యుడు డా. ముజ్మిల్తో కలిసి పనిచేసినట్లు దర్యాప్తులో తేలింది. వీరిద్దరూ కలిసి హమాస్ (Hamas) తరహా డ్రోన్ దాడులకు ప్లాన్ చేయడంలో, సమన్వయంతో కూడిన పేలుళ్ల కోసం చిన్నపాటి రాకెట్లను అభివృద్ధి చేయడంలో పాలుపంచుకున్నారు. బిలాల్.. డ్రోన్లను, వాటి బ్యాటరీలను, కెమెరా వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయడంలో ముఖ్యపాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
సోదాలు జరుగుతున్న నివాసాలు:
-
ఖాజీగుండ్‌లోని డాక్టర్ ఆదిల్
-
జాసిర్ బిలాల్ వనీ ఇల్లు
-
షోపియాన్‌లోని మౌల్వి ఇర్ఫాన్ వాగే ఇల్లు
-
పుల్వామాలోని కోయిల్‌లోని డాక్టర్ ముజ్మిల్ ఇల్లు
-
పుల్వామాలోని సంబురాలోని అమీర్ రషీద్ ఇల్లు
ఢిల్లీ పేలుడు వెనుక ఉన్న ఈ వైట్ కాలర్ మాడ్యూల్‌ను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా ఎన్‌ఐఏ తన దర్యాప్తును పకడ్బందీగా కొనసాగిస్తోంది.
