Vizianagaram: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తమ్మన్నమెరక సమీపంలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వివాహమై కేవలం ఎనిమిది నెలలైన యువ దంపతులు తమ నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మృతులను కొప్పుల చిరంజీవి (30), గీతల వెంకటలక్ష్మి (28)గా గుర్తించారు. చిరంజీవి విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా, అతని భార్య వెంకటలక్ష్మి కొత్తవలసలోని ఒక దుకాణంలో ఉద్యోగం చేస్తోంది. శుక్రవారం రాత్రి ఈ జంట విగతజీవులుగా కనపడ్డారు. భర్త చిరంజీవి ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతుండగా, భార్య వెంకటలక్ష్మి నేలపై పడి ఉంది.
Also Read: Kukatpally Murder Case: హత్య చేసిన తర్వాత కత్తి ని కడిగాను.. సహస్ర హత్యకేసులో విస్తుపోయే నిజాలు
ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆత్మహత్యగా భావిస్తున్నారా? లేక వారిని ఎవరైనా హత్య చేశారా? అనేది తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులు, బంధువుల కథనం ప్రకారం, ఈ జంట చాలా అన్యోన్యంగా ఉండేవారని, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నట్లు తమకు తెలియదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు మృతికి గల కారణాలను అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు.
సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను కూడా నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం కోసం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


