Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రైలు ప్రయాణం నవ దంపతుల జీవితాలు అకాలంలోనే ముగిశాయి. వంగపల్లి–ఆలేరు రైలుమార్గంలో గురువారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం, ఏపీ పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లి గ్రామానికి చెందిన కోరాడ సింహాచలం (25), అదే జిల్లాలోని అంకవరం గ్రామానికి చెందిన భవాని (19) రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్నారు. ఉపాధి నిమిత్తం సింహాచలం హైదరాబాద్‌లోని ఓ కెమికల్ కంపెనీలో పనిచేస్తూ, జగద్గిరిగుట్ట గాంధీనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
Also Read: Traffic Restrictions: మెహిదీపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు.. డిసెంబర్ 21 వరకు ఈ మార్గాల్లో మళ్లింపు!
విజయవాడలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లేందుకు సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో ఈ దంపతులు ప్రయాణం ప్రారంభించారు. రైలు వంగపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత డోర్ వద్ద నిలబడి ఉన్న సమయంలో ఇద్దరూ అనుకోకుండా ట్రాక్‌పై జారి పడిపోయినట్లు రైల్వే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. విధుల్లో ఉన్న ట్రాక్‌మెన్ రైల్వే ట్రాక్‌పై మృతదేహాలను గమనించి వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న భువనగిరి రైల్వే జీఆర్పీ పోలీసులు మృతులను గుర్తించి కేసు నమోదు చేశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. కొత్తగా పెళ్లైన తమ పిల్లలకు ఇంత త్వరగా ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నారు. “ఇప్పుడే సంసారం మొదలైంది, ఇంతలోనే ఇలా అయిపోతుందా” అంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నట్లు భువనగిరి రైల్వే జీఆర్పీ ఇన్‌ఛార్జి కృష్ణారావు తెలిపారు.

