Andhra Pradesh: కాళ్ళపారాణి ఆరనే లేదు.. అచ్చటముచ్చట తీరనేలేదు.. అప్పుడే నిండు నూరేళ్ళు నిండాయి. నిన్నగాక మొన్న పసుపుతాడు కట్టించుకున్న నవ వధువు మెడకే ఉరితాడు వేలాడింది. కలకాలం కాపురం చేయాల్సిన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసింది. పుట్టింట్లోనే కన్న వాళ్ళకు పుట్టెడు దుఖాఃన్ని వదలి తాను వెళ్ళిపోయింది. ఎందుకిలా చేసిందో అర్ధంకాక బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో వెలుగు చూసిన ఈ హృదయ విదాకర ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కంభం మండలం దేవనగరం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నవవధువు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఫిబ్రవరి 16వ తేదీన కుటుంబ సభ్యులు సుస్మితకు పెద్దారవీడు మండలం సిద్ది నాయుడు పల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ కు వివాహం చేశారు. ఫిబ్రవరి 17వ తేదీన వధువు స్వగ్రామమైన దేవనగరంలో తొలిరాత్రి కార్యం కూడా జరిపించారు. మరుసటి రోజు అంటే 18వ తేదీ వరకు అందరితో బాగానే మసలుకుంది. నవ వధువుకు బంధువుల పరామర్శ కూడా జరిగింది. ఇక పుట్టింటి నుంచి బయలుదేరి అత్తారింటికి వెళ్ళాలి. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో మధ్యాహ్నం సుస్మిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Also Read: Health Alert: ప్రాణాంతకంగా మారిన అంటు వ్యాధులు, భారత్‌లో పరిస్థితి మరీ దారుణం
ఏం జరిగిందో ఎవరికీ అర్ధం కావడం లేదు.. ఇష్టంలేని పెళ్ళి చేశారా.. లేక ఇంకేమైనా జరిగిందా.. అనేది ఇంకా తేలలేదు. అకస్మాత్తుగా సుస్మిత ఎవరు లేని సమయాన్ని చూసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పెళ్ళికి వచ్చిన దగ్గరి బంధువులను కన్నీరు పెట్టించింది. ఉరి వేసుకున్న నవవధువు సుస్మితను కుటుంబ సభ్యులు కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కానీ అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇష్టంలేని పెళ్లి చేశారని నవ వధువు ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి చెందడంతో దేవనగరం గ్రామంలో విషాదం నెలకొంది.