Crime News: కాళ్లపారాణి ఆరకముందే ఓ నవవధువు ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది. సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షిత (22)కు కర్ణాటకలోని బాగేపల్లి పరిధి దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్రతో సోమవారం ఉదయం ఘనంగా పెళ్లి జరిపించారు.
నూతన దంపతులకు సోమందేపల్లిలో ఫస్ట్ నైట్ నిర్వహించేందుకుగాను బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తన రూమ్ లోకి వెళ్లిన నవవధువు హర్షిత గది పైకప్పునకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఎంతసేపటికి యువతి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు గది తలుపులు పగలగొట్టారు. వెంటనే ఆమెను పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే హర్షిత మృతి చెందినట్లుగా వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Viveka Murder Case: వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి.. సుప్రీంకు తెలిపిన సీబీఐ
ఇంతకు ఆమె ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. ఇక మరో ఘటనలో పెళ్ళైన ఆరు నెలలకే భర్త వేధింపులు భరించలేక నవవధువు ఆత్మహత్య చేసుకుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామంలో విలేజ్ సర్వేయర్‌గా పని చేస్తున్న రాంబాబుకు, ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్న శ్రీవిద్య(24)ను ఇచ్చి 6 నెలల క్రితం పెళ్లి చేశారు పెద్దలు. పెళ్ళైన నెల రోజుల నుంచే తాగొచ్చి శ్రీవిద్యను దారుణంగా కొట్టి హింసించాడు రాంబాబు.
ఓ అమ్మాయి ముందు తాను పనికిరానని రాంబాబు హేళనగా మాట్లాడాడని.. తన తలను మంచానికి వేసి కొట్టి, వీపుపై పిడిగుద్దులు గుద్ది హింసించాడని సూసైడ్ లేఖలో రాసింది శ్రీవిద్య. ఈ స్థితికి కారణమైన రాంబాబును, అతని కుటుంబసభ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అంటూ సూసైడ్ లేఖ రాసి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది శ్రీవిద్య.