Dowry Harassment: పెళ్లైన ఏడాది కూడా తిరగకముందే గోపాలపట్నంలోని రామకృష్ణనగర్‌లో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. అయితే, మృతురాలి ముఖంపై గాయాలు ఉండటంతో, ఆమె తల్లిదండ్రులు అల్లుడే తమ కూతురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని సంచలన ఆరోపణలు చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది.
వివాహం, వేధింపులు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చోడవరం మండలం గోవాడ పంచాయతీకి చెందిన వేపాడ దిలీప్ శివకుమార్‌తో అచ్యుతాపురం వాసి అయిన బి. విజయశ్యామల (25) వివాహం గత ఏడాది డిసెంబరు 6న జరిగింది. పెళ్లి సమయంలో భారీగానే కట్నకానుకలు ఇచ్చారు. ఉద్యోగరీత్యా దిలీప్ శివకుమార్, విజయశ్యామల దంపతులు గత కొన్ని నెలల నుంచి జీవీఎంసీ 91వ వార్డు పరిధిలోని రామకృష్ణనగర్‌లో నివసిస్తున్నారు. పెళ్లి తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు ఈ జంట. కానీ కొన్ని నెలల తర్వాత దిలీప్ అసలు రూపం బయటకి వచ్చింది అదనపు కట్నం కోసం శ్యామలను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు.
ఆత్మహత్య.. అనుమానాలు
ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని ఎంత వేధించిన కొట్టిన తిట్టినా భరించింది. భరిస్తుంది అని ఇంకా ఎక్కువగా వేధించారు. ఇంకా తట్టుకోలేకపోయిన శ్యామల, భర్త లేని సమయం చూసి ఆదివారం అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇది కూడా చదవండి: Richa Ghosh: వరల్డ్‌కప్ విజేత రిచా ఘోష్‌కు అరుదైన గౌరవం
మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు, పక్కనే ఆమె రాసినట్లు భావిస్తున్న ఆత్మహత్య లేఖతో పాటు ఒక చిన్నారి చిత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు.అక్కడ దొరికిన లేఖలో ఏముంది అన్నది బయటికి చెప్పలేదు ఇంకా ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరోకూడా స్పష్టత ఇవ్వలేదు.పశ్చిమ ఏసీపీ పృధ్వీతేజ్, స్థానిక సీఐ లెంక సన్యాసినాయుడు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
తల్లిదండ్రుల సంచలన ఆరోపణలు
ఘటన స్థలానికి చేరుకున్న మృతురాలి తల్లిదండ్రులు కుమార్తె ముఖంపై గాయాలు ఉండటాన్ని గమనించి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదు. మా కూతురిని అల్లుడు దిలీప్ శివకుమారే చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాడు అని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు వరకట్న వేధింపులు (Dowry Harassment) మరియు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. వెంటనే పోలీసులు భర్త దిలీప్ శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఎంత పనిచేశావ్ శ్యామలా. అంటూ తల్లి రోజారమణి రోదించిన తీరు అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది.
ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియలిసి ఉంది. మరణానికి కారణం వరకట్న వేధింపులే కారణమా.. లేక వేరే కారణాలు అన్నయ్యా అనేది తెలియాల్సి ఉంది.

