Union Budget 2026-2027: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026 దేశాభివృద్ధికి సరికొత్త దిశానిర్దేశం చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత్ మాత్రం 7 శాతం వృద్ధి రేటుతో స్థిరంగా దూసుకుపోతోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. పేదలు, యువత, ఆదివాసీల సంక్షేమమే ధ్యేయంగా ఈ బడ్జెట్‌ను తీర్చిదిద్దారు.
హైదరాబాద్‌కు మూడు హైస్పీడ్ రైళ్లు: తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా హైదరాబాద్‌కు ఈ బడ్జెట్‌లో భారీ కేటాయింపులు లభించాయి. దేశవ్యాప్తంగా ప్రకటించిన 7 కొత్త హైస్పీడ్ రైలు కారిడార్లలో మూడింటికి హైదరాబాద్ కేంద్రంగా ఉంది:
- పుణే – హైదరాబాద్
- హైదరాబాద్ – బెంగళూరు
- హైదరాబాద్ – చెన్నై మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 12.2 లక్షల కోట్లు కేటాయించింది.
వైద్యం మరియు పరిశోధనలకు ఊతం: ఔషధ రంగాన్ని బలోపేతం చేసేందుకు రూ. 10,000 కోట్లతో ‘బయో ఫార్మా శక్తి’ పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా 1000 క్లినికల్ ట్రయల్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే, సంప్రదాయ వైద్యం కోసం జామ్‌నగర్‌లో పరిశోధన కేంద్రం, మూడు కొత్త ఆయుర్వేద ఆసుపత్రులను నిర్మించనున్నారు.
ఇది కూడా చదవండి: Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు భారీ షాక్.. రూ. 18 సిగరెట్ ఇక రూ. 72!
సెమీకండక్టర్ మరియు ఖనిజాల వెలికితీత: భారత్‌ను టెక్నాలజీ హబ్‌గా మార్చేందుకు ‘సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.0’ కోసం రూ. 40,000 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల (Rare Earth Minerals) వెలికితీతకు ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టారు.
మహిళా సంక్షేమం మరియు విద్య: బాలికల విద్యను ప్రోత్సహించేందుకు దేశంలోని ప్రతి జిల్లాలో ఒక బాలికల వసతి గృహం (Hostel) ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పర్యాటక రంగంలో ఉపాధి పెంచేందుకు 10,000 మంది గైడ్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు.
పన్ను చెల్లింపుదారులకు కొత్త చట్టం: సామాన్యులకు అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. సవరించిన కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ – 2025 ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. పన్ను చెల్లింపు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఈ మార్పులు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
ఎన్నారైల కోసం స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పరిమితి పెంపు, వారణాసి మరియు పాట్నాల్లో షిప్ రిపేర్ కేంద్రాల ఏర్పాటు వంటి మరిన్ని కీలక నిర్ణయాలతో ఈ బడ్జెట్ ‘వికసిత భారత్’ లక్ష్యానికి బాటలు వేసింది.
