HCA New President: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడిగా గెలాక్సీ క్రికెట్ క్లబ్‌కు చెందిన అమర్‌నాథ్ కొత్త అధ్యక్షుడిగా నియామకం ఖరారైంది. 2023లో జరిగిన ఎన్నికల్లో కేవలం ఒక్క ఓటు తేడాతో (62-63) జగన్ మోహన్ రావు చేతిలో ఓడిపోయిన అమర్‌నాథ్, ఆ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేశారు. జగన్ మోహన్ రావు ‘శ్రీ చక్ర క్రికెట్ క్లబ్’ పేరుతో ఫోర్జరీ పత్రాలను సృష్టించి, తప్పుడు మార్గంలో ఎన్నికల్లో పోటీ చేశారని ఆరోపణలు వచ్చాయి.
Also Read: Ricky Ponting : టీ20 వరల్డ్ కప్‌లో అతడే టాప్ స్కోరర్: రిక్కీ పాంటింగ్ జోస్యం!
ఈ నేపథ్యంలో, నిధుల దుర్వినియోగం, ఇతర అక్రమాలపై జగన్ మోహన్ రావును పోలీసులు అరెస్ట్ చేయడంతో గత తొమ్మిది నెలలుగా హెచ్‌సీఏ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఈ వివాదాన్ని పరిశీలించిన అంబుడ్స్‌మన్ జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జగన్‌ను పదవి నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ కార్యకలాపాలు సజావుగా సాగాలనే ఉద్దేశంతో, రన్నరప్‌గా నిలిచిన అమర్‌నాథ్‌ను నూతన అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మిగిలిన తొమ్మిది నెలల పదవీ కాలానికి అమర్‌నాథ్ అధ్యక్షుడిగా కొనసాగుతారని, వారం రోజుల్లోగా బాధ్యతలు చేపట్టాలని అంబుడ్స్‌మన్ ఆదేశించారు. సెంట్రల్ ఎక్సైజ్ మాజీ ఉన్నతాధికారి అయిన అమర్‌నాథ్ రాకతో హెచ్‌సీఏలో మళ్లీ పారదర్శకత వస్తుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
