Online gaming law: కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ చట్టం వల్ల బీసీసీఐ, భారత క్రికెటర్లకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ చట్టం రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే, టీమిండియా ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్11 బీసీసీఐతో తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా బీసీసీఐకి దాదాపు రూ. 358 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. అయితే ఈ డీల్ రద్దు అవడం వల్ల బీసీసీఐ సుమారు రూ. 125 కోట్ల వరకు నష్టపోవచ్చని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. కేవలం బీసీసీఐపైనే కాకుండా ఐపీఎల్ ఫ్రాంచైజీలపైనా ఈ చట్టం ప్రభావం చూపుతోంది. కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వంటి జట్లకు ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లు స్పాన్సర్లుగా ఉన్నాయి.
Also Read: Sachin-Joe Root: అప్పుడే జో రూట్ పెద్ద ప్లేయర్ అవుతాడనుకున్నా: సచిన్
ఈ యాప్స్ తమ ఒప్పందాలను రద్దు చేసుకుంటే ఆయా జట్లకు కూడా నష్టం వాటిల్లుతుంది. డ్రీమ్11, మై11సర్కిల్, ఎంపీఎల్ వంటి గేమింగ్ యాప్‌లకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని వంటి స్టార్ క్రికెటర్లు కూడా భారీగా ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ క్రికెటర్లందరూ కలిపి ఏటా రూ. 150 నుంచి 200 కోట్లు నష్టపోవచ్చని అంచనా. ఈ బిల్లు తీసుకురావడం వెనుక ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనంతో ఆర్థికంగా, మానసికంగా నష్టపోతున్న ప్రజలను రక్షించడమే ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. అయితే, దీనివల్ల భారీగా ఆదాయాన్ని కోల్పోతున్న క్రీడా రంగానికి ఇది ఒక సవాలుగా మారింది. ఈ చట్టం ప్రభావం భారత క్రికెట్‌పై గణనీయంగా ఉంటుందని, ముఖ్యంగా స్పాన్సర్‌షిప్, ఆటగాళ్ల వ్యక్తిగత ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

