Flight Ticket Cancellation: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ క్యాన్సిలేషన్ ఫ్రీ

Flight Ticket Cancellation: విమాన ప్రయాణికులకు పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. దేశంలోని సివిల్ ఏవియేషన్ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ) విమాన టిక్కెట్ల రద్దు, సవరణ విధానాల్లో కీలక మార్పులకు సిద్ధమవుతోంది. తాజా ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం, ఇకపై ప్రయాణికులు బుక్ చేసిన 48 గంటలలోపు టిక్కెట్లను రద్దు చేసుకోవడం లేదా మార్చుకోవడం ఉచితం. అదనపు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

ఇప్పటి వరకు ఎయిర్‌లైన్స్ రద్దు లేదా సవరణలపై అధిక ఫీజులు వసూలు చేయడం వల్ల ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో డిజిసిఏ విమాన ప్రయాణికుల సమస్యలను పరిష్కరించే దిశగా ముందడుగు వేసింది. ఈ కొత్త ప్రతిపాదనలు ఆమోదం పొందితే, ప్రయాణికులు ఇకపై తమ బుకింగ్‌లలో మార్పులు చేయడంలో ఎటువంటి ఆర్థిక భారం అనుభవించాల్సిన అవసరం ఉండదు.

డిజిసిఏ ప్రతిపాదన ప్రకారం, ప్రయాణికుడు బుకింగ్ చేసిన 48 గంటలలోపు రద్దు లేదా మార్పు చేస్తే ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు. అయితే, డొమెస్టిక్ ఫ్లైట్ బయలుదేరే తేదీకి 5 రోజులు లేదా అంతర్జాతీయ ఫ్లైట్‌కు 15 రోజుల్లోపుగా టిక్కెట్ బుక్ చేస్తే ఈ సౌకర్యం వర్తించదు. 48 గంటల తర్వాత సాధారణ క్యాన్సిలేషన్ చార్జీలు మాత్రమే వసూలు చేయవచ్చు.

రీఫండ్ ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని డిజిసిఏ ఆదేశించింది. రద్దు చేసిన టిక్కెట్లకు 21 వర్కింగ్ డేస్‌లోపుగా రీఫండ్ పూర్తి చేయాలి. ఫ్లైట్ రద్దు అయినా లేదా ప్రయాణికుడు నో-షో అయినా, ఎయిర్‌లైన్‌లు స్టాట్యూటరీ టాక్స్‌లు, ఎయిర్‌పోర్ట్ ఫీజులు తప్పనిసరిగా తిరిగి చెల్లించాలి. అలాగే బుకింగ్ చేసిన 24 గంటలలోపు చిన్న పేరు సవరణలు చేసినప్పుడు ఎటువంటి అదనపు ఛార్జీలు విధించకూడదు. ఇక ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసిన టిక్కెట్ల రీఫండ్ బాధ్యత కూడా ఎయిర్‌లైన్‌లదే అని స్పష్టం చేసింది. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా రద్దు చేసినప్పుడు ప్రయాణికుడు అంగీకరిస్తేనే క్రెడిట్ షెల్ ఇవ్వాలి, బలవంతంగా ఇవ్వరాదు.

Also Read: UP News: పట్టాలు దాటుతున్న యాత్రికులను ఢీకొన్న రైలు.. ఆరుగురు మృతి

ఈ ప్రతిపాదనలకు కారణం కూడా స్పష్టమే. గత కొన్ని నెలలుగా డిజిసిఏకు విమాన ప్రయాణికుల నుండి అనేక ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా రద్దు చార్జీల విషయంలో విమానయాన సంస్థలు అధిక మొత్తాలు వసూలు చేస్తున్నాయని వినియోగదారుల సంస్థలు కూడా దృష్టికి తెచ్చాయి. ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడాలన్న ఉద్దేశంతోనే ఈ మార్పులు చేయాలని డిజిసిఏ నిర్ణయించింది.

ప్రయాణికులకు టిక్కెట్లను సవరించడానికి లేదా రద్దు చేసుకోవడానికి ఎక్కువ సమయం లభించడం వల్ల ఫిర్యాదులు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. అలాగే రీఫండ్ ప్రక్రియ వేగవంతం కావడం, అదనపు చార్జీలపై స్పష్టత రావడం వల్ల ప్రయాణికులు మరింత నమ్మకంతో బుకింగ్‌లు చేయగలుగుతారు.

డిజిసిఏ ఈ కొత్త సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్స్ (CAR) పై నవంబర్ 30 వరకు స్టేక్‌హోల్డర్ల అభిప్రాయాలు కోరుతోంది. ఈ మార్గదర్శకాలు ఆమోదం పొందితే, విమాన ప్రయాణ రంగంలో పారదర్శకత పెరగడమే కాకుండా ప్రయాణికులకు పెద్ద సౌలభ్యం కలగనుంది. విమానయాన సంస్థలపై బాధ్యత పెరగడం, రీఫండ్ ప్రక్రియ వేగవంతం కావడం వలన దేశీయ విమాన ప్రయాణ వ్యవస్థ మరింత నమ్మకాన్ని పొందే అవకాశం ఉంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *