ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిషి మర్లెనా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే ఊహాగానాలు ఊపందుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అతీషి మర్లెనాను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.
ఉదయం నుంచి కేజ్రీవాల్ నివాసంలో పార్టీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ క్రమంలో పలువురి పేర్లు వినిపించాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అతిషి పేర్లు ముందుకు వచ్చాయి. అయితే కేజ్రీవాల్ సమావేశంలో అతిషి పేరును ప్రకటించగా, ఇతర నేతలు ఆయనకు మద్దతు పలికారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేతలు జైలుకు వెళ్లాల్సి వచ్చినప్పుడు అతిషి పార్టీ బాధ్యతలు చేపట్టారు. పార్టీ పట్ల ఎనలేని విధేయతను ప్రదర్శించారు. దీంతో ఆమె వైపే కేజ్రీవాల్ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.
ఇక ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్ మొన్నటివరకు తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈయన సెప్టెంబర్ 13న బెయిల్‌పై విడుదలయ్యారు. దీని తర్వాత ఆయన రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని సెప్టెంబర్ 15నప్రకటించారు. ప్రజాతీర్పు ఇచ్చేంత వరకు తాను సీఎం పదవిలో కూర్చోబోనని చెప్పారు. తనకు పదవులు, సంపదపై అత్యాశ లేదన్న సందేశం పంపాలని కేజ్రీవాల్ భావిస్తున్నట్లు వినిపిస్తోంది.