Netflix: 7 లక్షల కోట్ల డీల్ ఓకే చేసిన Netflix

Netflix: ఓటీటీ రంగంలో సంచలనాత్మక పరిణామంగా నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థను కొనుగోలు చేసే భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సుమారు 82.7 బిలియన్ డాలర్లు (రూ. 7.43 లక్షల కోట్లు) విలువైన ఈ డీల్, ప్రపంచ వినోద పరిశ్రమ చరిత్రలోనే అతి పెద్ద విలీనంగా నిలవనుంది. వార్నర్ బ్రదర్స్‌కు చెందిన స్టూడియోలు, హెచ్‌బీఓ వంటి ప్రముఖ నెట్‌వర్క్‌లు, స్ట్రీమింగ్ యూనిట్ మొత్తం నెట్‌ఫ్లిక్స్ ఆధీనంలోకి రానుంది. ఒక్కో షేరు 27.75 డాలర్ల చొప్పున కొనుగోలు చేస్తూ, నెట్‌ఫ్లిక్స్ ఈ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

 

ఈ డీల్ పూర్తయ్యేందుకు, ముఖ్యంగా సీఎన్ఎన్‌, టీబీఎస్‌ వంటి వార్నర్‌కు చెందిన కేబుల్ ఛానళ్లలో యాజమాన్య మార్పులు పూర్తి చేయాల్సి ఉంటుందని, ఇవి పూర్తయిన తర్వాత 2026 మూడో త్రైమాసికంలో ఒప్పందం అధికారికంగా అమల్లోకి రానున్నట్లు సమాచారం. ఇప్పటివరకు భారీ స్థాయి స్టూడియోలను సొంతం చేసుకోకుండా, ఇతర సంస్థల నుంచి కంటెంట్ లైసెన్సింగ్‌తో ఎదిగిన నెట్‌ఫ్లిక్స్‌కు ఇది తొలి మెగా కొనుగోలు కావడం విశేషం.

 

ఈ వ్యవహారంతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’, ‘ది లాస్ట్ ఆఫ్ అస్’, ‘సక్సెషన్’ వంటి సిరీస్‌లతో పాటు ‘హ్యారీ పాటర్’, ‘ఫ్రెండ్స్’, ‘ది డార్క్ నైట్’ వంటి పలువురు క్లాసిక్ సినిమాలు, డీసీ కామిక్స్ కలెక్షన్ కూడా నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీలో చేరనున్నాయి. దీంతో వినియోగదారులకు అందుబాటులో ఉండే కంటెంట్ మరింత విస్తరించనుంది.

 

అయితే థియేటర్లలో సినిమాలను విడుదల చేసే సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. కానీ థియేటర్‌ నుంచి స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫార్మ్‌కు వచ్చే గ్యాప్ తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. హెచ్‌బీఓ కంటెంట్‌ను సబ్‌స్క్రయిబర్లకు కాంప్లిమెంటరీగా ఇవ్వడం, రెండు లైబ్రరీలను కలిపి కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ప్రవేశపెట్టడం వంటి అవకాశాలపై కూడా నెట్‌ఫ్లిక్స్ సంకేతాలు ఇచ్చింది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *