తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు వచ్చిన వార్తలను లేడీ సూపర్ స్టార్ నయనతార స్పందించారు. ఈ వార్తలను ఆమె ఖండించారు. తన ముఖాన్ని మార్చుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని తెలిపారు.
తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన నయన్..‘నా కనుబొమలు అంటే నాకు చాలా ఇష్టం. వాటి ఆకారం ఎప్పుడూ మారుస్తూ ఉంటాను. ప్రతి రెడ్ కార్పెట్ ఈవెంట్లకు ముందు వాటిని మార్చుతుంటాను. వాటి కోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తాను. కనుబొమల ఆకారం మారినప్పుడల్లా ముఖంలో మార్పు కనిపిస్తుంది. బహుశా అందుకే నా ముఖంలో మార్పులు వచ్చాయని ప్రజలు అనుకొని ఉంటారు. వాళ్లు అనుకున్నది నిజం కాదు. నేను ఎప్పటికప్పుడు ఆహారపు అలవాట్లు మారుస్తుంటా.. అందువల్ల కొన్నిసార్లు నా ముఖంలో మార్పులు రావచ్చు. ఒక్కోసారి నా బుగ్గలు బయటకు కనిపిస్తాయి. మరికొన్నిసార్లు బుగ్గలు లోపలకు వెళ్లినట్టు అనిపిస్తాయి. కావాలంటే మీరు నన్ను గిచ్చి చూడొచ్చు.. నా శరీరంలో ఎక్కడా ప్లాస్టిక్ ఉండదు. కాస్మొటిక్ సర్జరీ చేయించుకోవడమనేది హీరోయిన్ల వ్యక్తిగత ఎంపిక.. ఇందులో ఎవ్వర్నీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు’ అని చెప్పుకొచ్చింది. కాగా నయనతార సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘డియర్ స్టూడెంట్స్’, ‘తని ఒరువన్ 2’ సినిమాలతోపాటు మరికొన్ని సినిమాలను లైన్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే.. తనపై జరిగిన బాడీ షేమింగ్ ను ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తీవ్రంగా ఖండించింది. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ వచ్చిన వార్తల్ని ఖండిస్తూ, సోషల్ మీడియాలో పెద్ద పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే.

