Mulugu: భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ లేఖను విడుదల చేసింది. “కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన పాశవిక హత్యకాండను తీవ్రంగా ఖండిస్తూ డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్త బంద్ పిలుపునిస్తున్నది. యావత్ పీడత ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యాలయాలు, తదితర వ్యాపార సంస్థలు బందును పాటించి జయ ప్రదం చేయాలని కోరుతోంది. ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి బాధ్యత వహించాలి. ఘటనపై న్యాయ విచారణ జరిపి.. బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్పోరేట్లకు అత్యంత విశ్వాసంగా కొమ్ముకాస్తుంది. వారి లాఖ కోసమే దోపిడి విధానాలను అమలు చేస్తున్నది. అందులో భాగంగానే ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డంకిగా మారిన ప్రజా ఉద్యమాల అణిచివేయడానికి ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీని, పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ కగార్ కొనసాగిస్తున్నారు. దామెరతోగు, రఘునాథపాలెం, పోల్ కమ్మ వాగు వంటి వరుస ఎన్ కౌంటర్ల పేరుతో హత్యలకు పాల్పడుతున్నారు. ఈ పార్టీ కొనసాగిస్తున్న ఈ పాశవిక దాడులను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాము. నవంబర్ 30వ సాయంత్రం ఏడుగురితో ఉన్న తమ దళం వలస ఆదివాసీ గ్రామాన్ని కలిసి నమ్మిన వ్యక్తికి తినడానికి భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పాం.
ముందుగానే పోలీసులకు అప్లోవర్ గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషం ఇచ్చి స్పృహ కోల్పోయే లాగా చేశారు. స్పృహ కోల్పోయిన కామ్రేడ్స్ ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి తెల్లవారు జామున 4 గంటలకు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. శత్రువు పథకంలో చిక్కి అమూల్యమైన కామ్రేడ్స్ ప్రాణాలర్పించారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరులకు పేరు పేరున తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తోంది” అని లేఖలో తెలిపారు.