Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అపూర్వ విజయాన్ని నమోదు చేశారు. దాదాపు 25 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఆయన గెలుపొందడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దూకుడు ముందు ప్రత్యర్థులు ఏమాత్రం నిలబడలేకపోయారు.
ప్రతి రౌండ్‌లోనూ ‘నవీన్’ ఆధిపత్యం
ఈ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపు ఏకపక్షంగా సాగింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచే కాంగ్రెస్ అభ్యర్థి తన ఆధిక్యాన్ని కొనసాగించారు. ప్రతీ రౌండ్‌లోనూ ఆయన మెజారిటీని పెంచుకుంటూ పోయారు. చివరికి, ఒకానొక దశలో టికెట్ కూడా దక్కించుకోవడం కష్టమనుకున్న నవీన్ యాదవ్.. జూబ్లీహిల్స్ ఓటర్ల నుంచి అద్భుతమైన మద్దతును పొందారు.
రెండుసార్లు ఓటమి.. ఈసారి తొలి ‘విక్టరీ’
ఇప్పటివరకు రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, మొక్కవోని పట్టుదలతో పోరాడిన నవీన్ యాదవ్ చివరకు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. జూబ్లీహిల్స్ స్థానికుడైన 42 ఏళ్ల నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు. బీ.ఆర్క్ (ఆర్కిటెక్చర్) చదివిన ఆయన నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, సేవా కార్యక్రమాల ద్వారా స్థానిక నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇది కూడా చదవండి: Ponnam Prabhakar: జూబ్లీహిల్స్ ఓటర్లు అభివృద్ధికి పట్టంగట్టారు: మంత్రి పొన్నం
గత వైఫల్యాలు:
2009లో ఎంఐఎం తరఫున యూసుఫ్‌గూడ కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమి.2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి 41,656 ఓట్లతో రెండో స్థానంతో గట్టిపోటీ ఇచ్చి ఓటమి. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 18,817 ఓట్లకే పరిమితం.
అయినప్పటికీ, నవీన్ యాదవ్ నియోజకవర్గాన్ని వదలకుండా ‘నవ యువ ఫౌండేషన్’ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూనే వచ్చారు. సుదీర్ఘ కాలంగా ఎమ్మెల్యే కావాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న ఆయన, గతంలో ఎంఐఎంలో పనిచేసి, ఆ తర్వాత స్వతంత్రంగా పనిచేసి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
మాగంటి మరణంతో మలుపు
బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ టికెట్ కోసం అనేక పేర్లు పరిశీలించినప్పటికీ, పార్టీ అధిష్టానం అనూహ్యంగా నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపింది. పార్టీ నిర్ణయాన్ని నిజం చేస్తూ, మొదటిసారిగా ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న నవీన్ యాదవ్.. తన చిరకాల కల అయిన అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాన్ని ఈ ఉపఎన్నిక విజయం ద్వారా సాధించారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన విజయం కొత్త ఉత్సాహాన్ని నింపిందనడంలో సందేహం లేదు.

