National High Way: తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా పరిధిలో ఉన్న పెద్దగట్టుపై ఈ నెల 16 నుంచి లింగమంతుల జాతర జరుగుతుంది. ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది సహా ఒడిశా, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. వేల సంఖ్యలో వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. వీటితోపాటు 65వ విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు నడుస్తుంటాయి. దీంతో ఈ నెల 16 నుంచి మూడురోజులపాటు వాహనాలను మళ్లించనున్నారు.
National High Way: ఈ మేరకు వాహనాల మళ్లింపు సూర్యాపేట జిల్లా పోలీస్ అధికారులు ఆదేశాలను జారీ చేశారు. ఈ నెల 16వ తేదీన తెల్లవారుజాము నుంచే వాహనాల మళ్లింపు ఆంక్షలు అమలులో ఉంటాయని సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. ట్రాఫిక్ సమస్యను నివారించేందుకే ఈ చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. లేకుంటే భక్తుల వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకొని అవస్థల పాలవుతారని తెలిపారు.
మళ్లింపు-1 నార్కట్‌పల్లి వద్ద : హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి వద్ద మళ్లించి నల్లగొండ జిల్లా కేంద్రం మీదుగా మిర్యాలగూడ, నేరేడుచర్ల, హుజూర్‌నగర్, కోదాడ మీదుగా విజయవాడకు వెళ్లాల్సి ఉంటుంది.
మళ్లింపు -2 కోదాడ వద్ద : విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద మళ్లించి హుజూర్‌నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కట్‌పల్లి మీదుగా హైదరాబాద్ చేరుకోవాలి.
మళ్లింపు -3 : హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలు సూర్యాపేట జిల్లా టేకుమట్ల వద్ద జాతీయ రహదారి 365 మీదుగా వెళ్లాలి.
సూర్యాపేట-కోదాడ మధ్య నడిచే వాహనాల మళ్లింపు : కోదాడ, మునగాల, గుంపుల మీదుగా సూర్యాపేట పట్టణానికి వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు, ఇతర చిన్న ప్రజారవాణా వాహనాలు ఎస్ఆర్ఎస్‌పీ కాలువ నుంచి బీబిగూడెం నుంచి సూర్యాపేట పట్టణానికి వెళ్లాల్సి ఉంటుంది. సూర్యాపేట పట్టణం నుంచి కోదాడ వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రజారవాణా వాహనాలు కుడకుడ గ్రామం మీదుగా ఐలాపురం వద్ద ఖమ్మం జాతీయ రహదారి మీదుగా రాఘవాపురం స్టేజీ వనుంచి నామవరం గ్రామం మీదుగా జాతీయ రహదారి 65పై గుంజలూరు స్టేజీ వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపునకు పంపుతారు.

