National Herald Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలపై తాజాగా క్రిమినల్ కుట్ర అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) వీరిద్దరితో సహా మరో ఆరుగురు వ్యక్తులు, మూడు కంపెనీలపై కొత్తగా ఎఫ్‌ఐఆర్ (FIR) దాఖలు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌లో సోనియా, రాహుల్‌తో పాటు శాం పిట్రోడా, మరో ముగ్గురు వ్యక్తులు, అలాగే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL), యంగ్ ఇండియన్, మరియు డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మూడు కంపెనీల పేర్లు ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ పత్రిక మాతృసంస్థ అయిన సుమారు ₹2,000 కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ఏజేఎల్ (AJL)ను “మోసపూరితంగా చేజిక్కించుకోవడానికి” క్రిమినల్ కుట్ర పన్నారన్నది వీరిపై ప్రధాన ఆరోపణ.
ఇది కూడా చదవండి: Karthi: అన్నగారు వస్తారు: ఎంటర్‌టైనర్ పోలీస్‌గా కార్తి!
ఇందులో భాగంగా, కోల్‌కతాకు చెందిన షెల్ కంపెనీగా ఆరోపించబడుతున్న డోటెక్స్ మర్చండైజ్, యంగ్ ఇండియన్‌కు ₹1 కోటి ఇచ్చిందని, తద్వారా యంగ్ ఇండియన్ కాంగ్రెస్‌కు ₹50 లక్షలు చెల్లించి, ఏజేఎల్‌పై నియంత్రణ సాధించిందని ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఈ యంగ్ ఇండియన్ కంపెనీలో సోనియా, రాహుల్ గాంధీలకు చెరో 38 శాతం చొప్పున మొత్తం 76 శాతం వాటా ఉంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఇచ్చిన దర్యాప్తు నివేదిక ఆధారంగా అక్టోబర్ 3న ఈ ఎఫ్‌ఐఆర్ నమోదైనట్టు తెలిసింది. బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి 2012లో దాఖలు చేసిన పిటిషన్‌తో ఈ కేసు మొదలవ్వగా, రూ. 90 కోట్ల రుణ బకాయిని ఈక్విటీగా మార్చి ఆస్తులను యంగ్ ఇండియన్‌కు బదిలీ చేయడం వెనుక మోసం జరిగిందని ఆరోపణ. అయితే, ఈ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు పూర్తిగా ఖండిస్తూ, పత్రిక పునరుద్ధరణ కోసమే ఈ విలీనం జరిగిందని వాదిస్తున్నారు. ఈ కేసులో ఢిల్లీ కోర్టు తన నిర్ణయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేసిన ఒక రోజు తర్వాత ఈ కొత్త ఎఫ్‌ఐఆర్ వెలుగులోకి వచ్చింది.

