Narendra Modi: చైనాలోని టియాంజిన్‌లో జరిగిన 25వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాద సంస్థలకు బహిరంగంగా మద్దతు ఇస్తున్న కొన్ని దేశాలను తప్పుబడుతూ, అలాంటి విధానాలను ప్రపంచం ఇకపై సహించదని ఆయన స్పష్టం చేశారు. ఈ సదస్సులో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా హాజరయ్యారు.
“ఉగ్రవాదం ఏ ఒక్క దేశానికి మాత్రమే కాదు, మానవత్వానికే ముప్పు. ఇటీవలి పహల్గామ్ దాడి మానవ విలువలపై నేరుగా దాడి చేసినట్టే. ఇలాంటి సమయంలో కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం సహించలేనిది,” అని మోదీ తన ప్రసంగంలో గట్టిగా వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహం.. అంతాఇంతా కాదు
భారతదేశం గత నాలుగు దశాబ్దాలుగా ఉగ్రవాద భారాన్ని మోస్తోందని గుర్తుచేసిన మోదీ, పహల్గామ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. “ఈ క్లిష్ట సమయంలో మనతో నిలిచిన మిత్రదేశాలకు నా కృతజ్ఞతలు,” అని అన్నారు.
మోదీ ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి అనేది అస్సలు ఆమోదయోగ్యం కాదని హెచ్చరించారు. “ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనైనా, ఏ రంగులోనైనా మేము వ్యతిరేకించాలి. ఇది మానవత్వం పట్ల మన బాధ్యత,” అని ఆయన అన్నారు.
SCO ప్రాంతీయ ఉగ్రవాద నిరోధక నిర్మాణం (RATS) కింద భారతదేశం కీలక పాత్ర పోషిస్తోందని, అల్కైదా మరియు అనుబంధ గ్రూపులపై జరిగిన ఉమ్మడి సమాచార ఆపరేషన్లలో భారతదేశం ముందుండి పనిచేసిందని మోదీ వెల్లడించారు. ఉగ్రవాద నిధులను అడ్డుకోవడంలో భాగస్వామ్య దేశాల మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

