Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చెన్నై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ అనుమతులు (Environmental Clearance) లేకుండా పనులు చేపట్టరాదంటూ ఎన్‌జీటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఈ ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నట్లు సమాచారం అందిన నేపథ్యంలో ట్రిబ్యునల్ తీవ్రంగా స్పందించింది. పర్యావరణ నిబంధనలను విస్మరించి ఇలాంటి ప్రాజెక్టులు ముందుకు సాగకూడదని హెచ్చరించింది. పిటిషనర్ల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌జీటీ, ఒకవేళ పనులు మళ్లీ ప్రారంభమైతే తక్షణం తమ దృష్టికి తీసుకురావాలని వారికి లిటర్టీ ఇచ్చింది.
ఇది కూడా చదవండి: YS Jagan: తెలంగాణ హైకోర్టులో జగన్‌కు దక్కని ఊరట
దీంతో కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తాత్కాలికంగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ప్రాంతీయ రైతులు ఈ ప్రాజెక్టుపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్‌జీటీ ఆదేశాలతో ఆ కలలు కొంతకాలం వాయిదా పడే అవకాశముంది.
రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత మొదలు పెట్టిన ముఖ్యమైన ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఈ నిర్ణయం ప్రభుత్వం ప్రతిష్టకు దెబ్బతీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకపై పర్యావరణ అనుమతులు పొందకపోతే ప్రాజెక్టు భవిష్యత్తు అనిశ్చితంగా మారనుంది.