Narayana Murthy: దేశంలోని ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. 2023లో యువత వారానికి 70 గంటలు పనిచేయాలి అని చేసిన వ్యాఖ్యలతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా మూర్తి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా అదే మాటను మరింత బలంగా సమర్థించారు.
భారత యువత ఎక్కువ కష్టపడితేనే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది
అయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మూర్తి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలంటే యువత తమ శక్తి, సమయాన్ని మరింతగా పెట్టాలని అన్నారు. మన దేశం ముందుకు వెళ్లాలంటే ప్రతీ పౌరుడు కొద్దిగా అదనపు కృషి చేయాలి అని ఆయన స్పష్టం చేశారు.అంతే కాకుండా, ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఎదిగిన తీరు యువతకు ప్రేరణగా ఉండాలని పేర్కొన్నారు.
చైనా 9-9-6 మోడల్‌ను ఎందుకు ఉదహరించారు?
మూర్తి చైనా పని విధానాన్ని ఉదాహరణగా చూపిస్తూ చెప్పారు.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, వారంలో 6 రోజులు పని… అంటే ఒక్క వారంలో 72 గంటలు పని చేయాలి అని ఆయన అన్నారు.
అలిబాబా, హువావే వంటి చైనీస్ దిగ్గజాలు ఈ పని సంస్కృతితోనే ఎదిగాయని ఆయన అభిప్రాయం. ఇది తానే 2023లో సూచించిన 70 గంటల పని వారంకు చాలా దగ్గరగా ఉందని మూర్తి తెలిపాడు.
విమర్శలు ఉన్నా, చైనాలో పని సంస్కృతి మారలేదని మూర్తి సూచన
చైనాలో 9-9-6 పద్ధతిపై కొన్ని సంవత్సరాల క్రితం భారీ విమర్శలు వచ్చాయి. 2021లో చైనా సుప్రీంకోర్టు దీన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించినప్పటికీ, ఆచరణలో ఈ పద్ధతి ఇంకా కొనసాగుతోందని అంతర్జాతీయ నివేదికలను మూర్తి ప్రస్తావించారు. అంటే అభివృద్ధి కోరుకునే దేశాలు కఠినమైన పని సంస్కృతిని అంగీకరించాల్సిందే అని ఆయన అభిప్రాయం.
ముందుగా కెరీర్, ఆ తర్వాతే వర్క్–లైఫ్ బ్యాలెన్స్
భారత యువత ముందుగా తమ జీవితానికి గట్టి బేస్ తయారు చేసుకోవాలని, తర్వాతే వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై దృష్టి పెట్టాలని మూర్తి సూచించారు. యువత పని గంటలు పెంచితేనే భారతదేశం చైనాని చేరుకోవడం, దాటేయడం సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు.
మూర్తి వ్యాఖ్యలపై మళ్లీ రెండు విధాల స్పందన
మూర్తి వ్యాఖ్యలు మరోసారి దేశవ్యాప్తంగా రెండు వైపుల చర్చకు దారితీశాయి.. మద్దతు ఇచ్చేవారు అభివృద్ధికి కష్టమే మార్గమని అంటున్నారు. విమర్శలు చేస్తున్నవారు అధిక పని ఒత్తిడి ఆరోగ్యం, వ్యక్తిగత జీవనంపై భారీ ప్రభావం చూపుతుందని వాదిస్తున్నారు.
కానీ ఏం జరిగినా.. మూర్తి మాత్రం తన అభిప్రాయంపై నిలకడగా ఉన్నారు. భారత్ ఒక సూపర్ పవర్‌గా ఎదగాలంటే అసాధారణమైన కృషి తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు.
