Nara Lokesh: గత ఐదు రోజులుగా రాష్ట్రంలో భయానక వాతావరణానికి కారణమైన ‘మొంథా’ తుఫాన్ ఈ రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఇది తీరాన్ని తాకవచ్చని అంచనా. ఈ పెను తుఫాన్ ప్రభావం దాదాపు 40 లక్షల మంది ప్రజలపై ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఒక్క ప్రాణం కూడా పోకూడదనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపడుతోందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి పర్యవేక్షణ, ప్రధాని కార్యాలయానికి రిపోర్టులు
ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచే తుఫాన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రాష్ట్రం నుంచి వస్తున్న రియల్ టైం రిపోర్టులు ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా చేరుతున్నాయని మంత్రి లోకేష్ వెల్లడించారు. మొత్తం 1328 గ్రామాల్లో ముంపు ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు NDRF, SDRF బృందాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. అవసరం అయితే రంగంలోకి దిగేందుకు హైదరాబాద్‌లో ఆర్మీ బృందాలు కూడా అలెర్ట్‌గా ఉంచబడ్డాయి. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు ఈ నెల 29 వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలోకి వెళ్లవద్దని ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది.
విద్యుత్, కమ్యూనికేషన్స్‌పై ప్రత్యేక దృష్టి
తుఫాన్ సమయంలో చాలా ముఖ్యమైన విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినకుండా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. అత్యవసర పరిస్థితుల కోసం 13 వేలకు పైగా కరెంట్ పోల్స్, అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌లు సిద్ధంగా ఉంచారు. ముఖ్యంగా ఆసుపత్రులకు కరెంట్ సరఫరా ఆగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, 78 శాతం సెల్ టవర్లకు కావాల్సిన డీజిల్ సహా ఇతర సదుపాయాలను ఏర్పాటు చేసి, కమ్యూనికేషన్ వ్యవస్థ ఎక్కడా ఆగిపోకుండా చూసేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
పౌరులకు విజ్ఞప్తి: ఇంట్లోనే సురక్షితంగా ఉండండి!
ఆర్టీజీఎస్ (RTGS) వ్యవస్థ ద్వారా పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. తుఫాన్ తీరం దాటిన వెంటనే.. రియల్ టైం ట్రాకింగ్ ఆధారంగా తక్షణ సహాయక, పునరావాస చర్యలు మొదలుపెడతామని మంత్రి స్పష్టం చేశారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గాలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరించిన మంత్రి లోకేష్.. ప్రజలందరూ దయచేసి ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, ప్రభుత్వ అధికారులు ఇచ్చే సూచనలను తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాప్రతినిధులకు కీలక ఆదేశాలు
ముఖ్యంగా 1500 గ్రామాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రజాప్రతినిధులు (ఎమ్మెల్యేలు, ఎంపీలు) అందరూ నిరంతరం ప్రజలతో టచ్‌లో ఉండాలని ఆదేశించారు. తుఫాన్ తీరం దాటిన వెంటనే జరిగిన నష్టాన్ని అంచనా వేసి, సహాయక చర్యలు ప్రారంభించడానికి వీలుగా అందరూ వెంటనే ఫీల్డ్‌కు వెళ్లాలని లోకేష్ సూచించారు. ఎక్కువ ప్రభావం చూపిన ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన కరెంట్ పునరుద్ధరణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేసే వారిపై తగిన చర్యలు తీసుకునే అంశాన్ని హోం మంత్రి గారు చూసుకుంటారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మంత్రులు అందరూ ప్రభావిత ప్రాంతాల్లో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని లోకేష్ తెలిపారు.

