Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పదవి అంశం హాట్ టాపిక్‌గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. అంతా సాఫీగానే సాగుతుందనుకుంటున్న తరుణంలోనే డిప్యూటీ సీఎం పదవి తెరపైకి వచ్చింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడైన నారా లోకేశ్‌కు ఇవ్వాలంటూ పలువురు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ విషయం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Nara Lokesh: డిప్యూటీ సీఎం పదవి అంశంపై అటు టీడీపీలో, ఇటు జనసేనలో కొంత అపార్థాలు, అపోహలకు దారితీసింది. ఈ సమయంలో టీడీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకొని, ఆ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ క్యాడర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఎవరూ సోషల్‌మీడియాకు ఎక్కొద్దని ఇటు జనసేన కార్యకర్తలకు కూడా పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో ఇరుపార్టీలు సైలెంట్ అయ్యాయి.
Nara Lokesh: ఇదే దశలో దావోస్ వెళ్లిన లోకేశ్‌ను కొందరు మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఇప్పుడు తాను రాజకీయంగా మంచి పొజిషన్‌లో ఉన్నానని, ఎన్నికల్లో కూటమిని ప్రజలు 94 శాతం సీట్లను ఇచ్చారని, ప్రస్తుతం తనకు చేతినిండా పని ఉన్నదని, తనకు అప్పగించిన శాఖలపై పూర్తిస్థాయిలో పనిచేస్తున్నానని చెప్పారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన టార్గెట్లపై ఫోకస్ చేశానని తెలిపారు. గత ఐదేండ్లలో దారుణంగా దెబ్బతిన్న విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెచ్చేలా ప్రయత్నిస్తున్నానని చెప్పారు.
Nara Lokesh: డిప్యూటీ సీఎం పదవిపై, టీడీపీ పదవులపై నారా లోకేశ్ తాజాగా మరోసారి స్పందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని లోకేశ్ తెలిపారు. ఒక వ్యక్తి పార్టీ పదవిలో మూడు పర్యాయాలకు మించి ఉండకూడదని తన అభిప్రాయమని చెప్పారు. తాను మూడు పర్యాయాలు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పదవిలో ఉన్నానని, ఈసారి పదవిలో ఉండకూడదని అనుకుంటున్నట్టు తెలిపారు. తాను కార్యకర్తగానే పనిచేస్తానని లోకేశ్ చెప్పారు. పార్టీలో అందరికీ అవకాశాలు రావాలని కోరుకుంటున్నట్టు లోకేశ్ తెలిపారు.