Nara Lokesh: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్న నేపథ్యంలో, ఇప్పటివరకు ఎమ్మెల్యేలు ప్రజల్లో ఎలా పనిచేస్తున్నారో నివేదిక ఇవ్వాలని ప్రాంతీయ సమన్వయకర్తలను ఆయన ఆదేశించారు. పనితీరు ఆశించిన స్థాయిలో లేని ఎమ్మెల్యేలకు పార్టీ తరఫున కౌన్సెలింగ్ ఇస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా సరే పార్టీ సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు లోబడి ఉండాలని, పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన తేల్చిచెప్పారు.
పార్టీయే శాశ్వతం.. పదవులు తాత్కాలికం ఈ సందర్భంగా లోకేశ్ ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పారు. సచివాలయం అనేది మనకు అద్దె ఇల్లు లాంటిది, కానీ పార్టీ మన సొంత ఇల్లు. అధికారం ఉన్నప్పుడు మాత్రమే మనం సచివాలయంలో ఉంటాం, కానీ అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ మనకు తోడుగా ఉంటుంది అని అన్నారు. నాయకులు ఎంతటి వారైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు, నాయకులకు మధ్య సమన్వయం కుదిర్చే బాధ్యత ప్రాంతీయ సమన్వయకర్తలదేనని ఆయన గుర్తుచేశారు. ఒకవేళ ఇన్‌ఛార్జ్ మంత్రులు ఎవరైనా సమన్వయకర్తలకు అందుబాటులో లేకపోతే నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
కష్టపడిన వారికే పదవుల్లో ప్రాధాన్యం నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా లోకేశ్ స్పష్టతనిచ్చారు. దేవాలయ కమిటీలు, మార్కెట్ యార్డులు, ఇతర ప్రభుత్వ కార్పొరేషన్లలో పదవుల భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా గత ఐదేళ్లలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసుల వేధింపులను తట్టుకుని, పార్టీ కోసం కష్టపడి పోరాడిన నాయకులకే పదవుల్లో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఇతర పార్టీల నుంచి తాజాగా వచ్చిన వారికి పదవులు ఇచ్చే ప్రసక్తే లేదని, అటువంటి ప్రతిపాదనలు వస్తే నిర్దాక్షిణ్యంగా తిరస్కరించాలని సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ప్రజల చెంతకు పాలన.. పార్టీ కార్యాలయాల నిర్మాణం ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తున్న తీరుపై లోకేశ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో పెన్షన్ల పంపిణీ, స్వచ్ఛాంధ్ర వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను ఒకే రకమైన డిజైన్‌తో నిర్మించనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన స్థల సేకరణను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటివరకు సుమారు 38 కోట్ల రూపాయల బీమా పరిహారం చెల్లించినట్లు ఈ సమావేశంలో వెల్లడించారు.

