Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకాన్ని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆటో డ్రైవర్ల సేవా మనసును, సమాజంలో వారి పాత్రను ప్రశంసించారు.
లోకేష్ మాట్లాడుతూ, “ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆటో డ్రైవర్లు ఎప్పుడూ నవ్వుతూ పలకరిస్తారు. వారి వెనుక రాసిన కొటేషన్లు చదువుతుంటే వారి మనసు ఏంటో అర్థమవుతుంది” అని చెప్పారు. ఆటోలో ఏ వస్తువు మరిచిపోయినా డ్రైవర్లు నిజాయితీగా పోలీసులకు అందజేస్తారని కూడా గుర్తు చేశారు. అలాగే, తన తాత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ఖాకీ డ్రెస్ వేసుకుని ప్రజల్లోకి వెళ్లిన సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆటో డ్రైవర్లు కేవలం ప్రయాణం చేసే వ్యక్తులు మాత్రమే కాకుండా, గ్రామస్థాయి నుంచి దేశ స్థాయి రాజకీయాల వరకూ చర్చించే వారని లోకేష్ అభిప్రాయపడ్డారు.
వైసీపీ పాలనలో ఆటో డ్రైవర్లపై అనేక రకాల ఛార్జీలు వేసి భారాన్ని మోపారని విమర్శించిన ఆయన, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ తగ్గించామని, గుంతల మరమ్మతులకు రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టామని వెల్లడించారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారమే ఈ పథకం ప్రారంభించాం. ఆటో డ్రైవర్ల కష్టాలు తగ్గించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుంది అని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కొత్త మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు.