Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఏరోస్పేస్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి నారా లోకేశ్ ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన ఎయిర్‌బస్ సంస్థ బోర్డు సమావేశానికి ఆయన హాజరయ్యారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం భాగంగా తొలిసారిగా భారత్‌లోనే ఈ బోర్డు మీటింగ్ నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఎయిర్‌బస్ ప్రతినిధులతో మాట్లాడిన నారా లోకేశ్… ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు అనువైన వాతావరణం, అవసరమైన సదుపాయాలు సమృద్ధిగా ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో ఏరోస్పేస్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ, దానికి కావలసిన భూమి, మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: Chandrababu: ఏపీలో ప్రతి 50KMకి ఓ పోర్టు ఆలోచన చేస్తున్నాం
లోకేశ్ మాట్లాడుతూ – “ప్రోగ్రెసివ్ ఏరోస్పేస్ పాలసీ, ప్రత్యేక ప్రోత్సాహకాలు, మల్టిపుల్ కారిడార్ అనుసంధానం, ఎయిర్‌పోర్టులు, పోర్టుల సౌకర్యాలు – ఇవన్నీ ఏపీలో అందుబాటులో ఉన్నాయి. సింగిల్ విండో ద్వారా వేగవంతమైన అనుమతులు, అంతర్జాతీయ ప్రమాణాలకు సరిపోయే సదుపాయాలు కల్పిస్తాం” అని హామీ ఇచ్చారు.
ఎయిర్‌బస్‌కు గోల్డ్ స్టాండర్డ్ వేదికగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.