Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల అభివృద్ధికి మరో అడుగు వేశారు మంత్రి నారా లోకేశ్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తన పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ గురువారం (మే 8) నాడు శ్రీసిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు భూమి పూజ చేశారు. ఈ పరిశ్రమ రూ.839 కోట్ల పెట్టుబడితో ఐదు యూనిట్లతో ప్రారంభం కానుంది. ఇది రాష్ట్రానికి 2 వేల నేరుగా ఉద్యోగాలు ఇవ్వనుంది, దీని ద్వారా లక్షలమందికి పారిశ్రామిక అవకాశాలు ఏర్పడనున్నాయి.
ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ఇది కేవలం ఒక పరిశ్రమ శంకుస్థాపన మాత్రమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తుకు వేసిన బలమైన పునాది అని అన్నారు. ఎల్జీ సంస్థ పెట్టుబడులు పెట్టడం వల్ల రాష్ట్రంలో ‘‘ఎల్జీ సిటీ’’గా ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పడనుందని చెప్పారు.
ఎల్జీ ఈ స్థాయి పెట్టుబడి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు పడుతున్నాయని లోకేశ్ చెప్పారు. “మేడ్ ఇన్ ఆంధ్రా నుంచి మేడ్ ఫర్ ది వరల్డ్ వరకు ప్రయాణం మొదలైందంటూ” ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ప్రపంచస్థాయి పరిశ్రమల ఆకర్షణకు మార్గం వేస్తుందన్నారు.
రాష్ట్రంలో పరిశ్రమలు పెరగాలంటే కేవలం మంత్రులు, కలెక్టర్లు మాత్రమే కాకుండా, ప్రతి నియోజకవర్గం పరిశ్రమల కోసం పోటీ పడాలని లోకేశ్ పిలుపునిచ్చారు. శ్రీసిటీ యూనిట్ ఏర్పాటుతో రాష్ట్ర పరిశ్రమల వేగం, మౌలిక సదుపాయాల బలాన్ని ఇది చూపిస్తోంది అని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశ్రమలపై చూపిస్తున్న శ్రద్ధ, నిబద్ధత ఈ ప్రాజెక్ట్ ద్వారా స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు.
Also Read: Rohit Sharma: ప్రతి ఒక్కరికి యంగ్ కెప్టెన్ కావాలి.. రోహిత్ శర్మ సంచలన వ్యాఖ్యలు..!
Nara Lokesh: విదేశీ ప్రతినిధులు, కంపెనీల రాకపోకల కారణంగా త్వరలో తిరుపతి నుంచి అంతర్జాతీయ విమానయానాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. వ్యాపార వాతావరణాన్ని సులభతరం చేయడంపై రాష్ట్రం దృష్టి పెట్టిందని లోకేశ్ స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో నారా లోకేశ్ పర్యటన ఉన్నందువల్ల కేబినెట్ సమావేశానికి ముందస్తు అనుమతితో హాజరు కాలేదు. అలాగే, రేపు సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో మంత్రి పయ్యావుల కేశవ్ కూడా సమావేశానికి హాజరు కాలేదు. మంత్రి సత్య కుమార్ యాదవ్ విదేశీ పర్యటనలో ఉన్నారు.
ఎల్జీ పరిశ్రమ శంకుస్థాపనతో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల రంగానికి కొత్త దిక్సూచి ఏర్పడింది. భారీ పెట్టుబడులు, వేల ఉద్యోగాలు, దేశీయ-అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్ట్ రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది.