Nara lokesh: సింగపూర్ పర్యటనలో భాగంగా ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నూతన సాంకేతిక పరిజ్ఞానాలు, పారిశ్రామిక అవకాశాలను అధ్యయనం చేస్తూ కీలక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్, ఇన్ఫినియన్, ఐవీపీ సెమీ, డీటీడీఎస్, క్యాపిటాల్యాండ్ వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు.
మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ సందర్శన
సెసిల్ స్ట్రీట్ లోని మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి లోకేశ్, ఎఐ ఆధారిత వినూత్న అనువర్తనాలను పరిశీలించారు. రిటైల్, ఎడ్యుకేషన్, ఆరోగ్య సంరక్షణ, తయారీ వంటి విభాగాల్లో మైక్రోసాఫ్ట్ ఏఐ పరిష్కారాలను ఎలా అందిస్తుందో తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎక్స్‌పీరియన్స్ జోన్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని లోకేశ్ సూచించారు. అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీలో 2026లో ఓ హ్యాకథాన్ నిర్వహించేందుకు మైక్రోసాఫ్ట్ తో కలిసి పని చేయాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలోని ఐటీ నైపుణ్యాన్ని వినియోగించి జనరేటివ్ ఏఐ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, హైబ్రిడ్ క్లౌడ్ పరిజ్ఞానాలను విస్తరించాలన్నారు.
ఇన్ఫినియన్ సెమీకండక్టర్స్ యూనిట్‌లో పర్యటన
ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ ఇన్ఫినియన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను సందర్శించిన లోకేశ్, కంపెనీ ఎండి సిఎస్ చువాతో సమావేశమయ్యారు. ఏపీలో ప్యాకేజింగ్, అసెంబ్లింగ్, టెస్టింగ్ యూనిట్‌లను స్థాపించేందుకు సూచించారు. సెమీకండక్టర్ స్కిల్ అకాడమీ స్థాపనకు రాష్ట్రం సహకరిస్తుందని తెలిపారు.
ఐవీపీ సెమీ తో చిప్ డిజైన్ కల
ఐవీపీ సెమీ వ్యవస్థాపకుడు రాజా మాణిక్కంతో సమావేశమైన లోకేశ్, ఏపీలో చిప్ డిజైన్ కేంద్రం లేదా పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ ప్రతిపాదనపై సంస్థ త్వరలో నిర్ణయం తీసుకుంటుందని రాజా మాణిక్కం వెల్లడించారు.
డీటీడీఎస్, క్యాపిటాల్యాండ్ సంస్థలతో కీలక చర్చలు
డీటీడీఎస్ గ్రూప్ సీఈవో బీఎస్ చక్రవర్తితో భేటీలో ఎంఎస్ఎంఈలకు పరికరాల తయారీలో సాంకేతిక సహకారం అందించాలని లోకేశ్ సూచించారు. తమిళనాడు-ఏపీ సహకారం ద్వారా దేశవ్యాప్తంగా సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయాలని అన్నారు.
క్యాపిటాల్యాండ్ ఇన్వెస్టిమెంట్ సీఈఓ సంజీవ్ దాస్ గుప్తాతో సమావేశంలో విశాఖపట్నం వంటి నగరాల్లో డేటా సెంటర్లు, మిశ్రమ అభివృద్ధి మోడళ్లను ఏర్పాటు చేయాలని, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహాలు ఇవ్వాలని మంత్రి సూచించారు.