Nara lokesh: ఆంధ్రప్రదేశ్ ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నారు. తండ్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టిడిపి ప్రభుత్వం చేపట్టిన ఒక సంవత్సరపు పాలనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ‘యువగళం’ పేరుతో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రతిబింబించే పుస్తకాన్ని అందజేశారు.
అమిత్ షా నుంచి భరోసా
ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో సహకరిస్తామని హోంమంత్రి అమిత్ షా భరోసా ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణపై కేంద్రంతో సమన్వయం కొనసాగిస్తామని లోకేష్ వెల్లడించారు.
ఇతర కేంద్ర మంత్రులతో కూడిన చర్చలు
లోకేష్ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌లను విడివిడిగా కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.
విద్య రంగంలో సంస్కరణలు: ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక మార్పులు తీసుకువస్తున్నామని, ప్రత్యేకంగా విద్యార్థుల లెర్నింగ్ అవుట్‌కమ్‌లపై దృష్టి పెడుతున్నట్లు లోకేష్ తెలిపారు.
రాయలసీమ అభివృద్ధిపై దృష్టి: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘవాల్‌కు వినతి పత్రం అందజేశారు. అలాగే, రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయడంలో సహకరించాలంటూ కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను కోరారు.