Nara lokesh: తిరుపతిలో దళిత విద్యార్థి జేమ్స్‌పై జరిగిన దాడిని ఆధారంగా చేసుకుని, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని రాష్ట్ర విద్య, ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ దాడిలో నిందితులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల అనుచరులేనని ఆరోపిస్తూ, ఈ సంఘటనను టీడీపీపై బురద జల్లేందుకు జగన్, ఆయన మద్దతుదారులైన మీడియా సంస్థ ‘సాక్షి’ యత్నిస్తున్నాయని మండిపడ్డారు.
మే 15వ తేదీ రాత్రి తిరుపతిలో జేమ్స్ అనే దళిత విద్యార్థిని కిడ్నాప్ చేసి దాడి చేసిన ఘటనపై స్పందించిన లోకేశ్, బాధితుడి ఫిర్యాదు మేరకు యశ్వంత్, కిరణ్, జగ్గ (జగదీష్ అలియాస్), లలిత్ (లలిత్ గోపాల్), సాయి గౌడ్, వంశీ, రూపేష్ తదితరులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. వీరిలో పలువురు వైసీపీ నేతల అనుచరులుగా వ్యవహరిస్తున్నారని వివరించారు. జగ్గ, లలిత్, సాయి గౌడ్‌లు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులుగా ఉన్నారని, రూపేష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిలు ఎమ్మెల్యే భూమన అభినయ్ రెడ్డి వద్ద పనిచేసేవారన్నారు. వంశీ అలియాస్ చోటా బ్లేడ్, ఎంపీ గురుమూర్తికి చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు.
“ఇంత స్పష్టమైన ఆధారాలు ఉన్నా కూడా, ‘సాక్షి’ వార్తాపత్రికలో టీడీపీపై అర్థం లేని ఆరోపణలు చేస్తూ తప్పుడు కథనాలు ప్రచురించారు. వ్యక్తిగతంగా జరిగిన ఘటనను మా పార్టీపై ముద్ర వేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు. దళిత సమాజాన్ని రెచ్చగొట్టేలా విషప్రచారం చేస్తున్నారు,” అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నిందితులలో కొందరిని పోలీసులు అరెస్టు చేశారని, మిగిలినవారి కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. నేరముచేసినవారు ఎవరివైనా, ఎంతటి వారైనా ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు.
అదే సమయంలో, జగన్ గత రాజకీయ ప్రవర్తనపై కూడా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “రక్తచరిత్ర ఉన్న వ్యక్తి జగన్. కుటుంబంలో బాబాయిని దాడి చేసిన ఘాతుకానికి బాధ్యతవహించకుండా, బాబుగారిపై తప్పుదోవ పట్టించే కథనాలు ప్రచురించారు. అదే తీరును ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం వంటి దళితులపై దాడులకు పాల్పడ్డ జగన్, ప్రతిపక్షంలో ఉన్నా అదే వైఖరితో కొనసాగుతున్నారు” అన్నారు.
తిరుపతి ఘటనలో దళిత సమాజం మోసపోవద్దని, వాస్తవాలు తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు.