Nara lokesh: ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ వంటి మహత్తర ప్రాజెక్టులతో పాటు, స్థానిక స్థాయిలో కూడా సమగ్ర అభివృద్ధి జరగాలని ఆయన స్పష్టం చేశారు.
మంగళగిరి బైపాస్‌లోని ఆత్మకూరు ప్రాంతంలో లక్ష్మీ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాటా హిటాచీ డీలర్‌షిప్ షోరూమ్, మెషిన్ కేర్ ఫెసిలిటీని మంత్రి లోకేశ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “మంగళగిరి అమరావతికి ముఖద్వారం. ఇక్కడి అభివృద్ధి అంటే రాష్ట్ర రాజధాని అభివృద్ధి. బుల్డోజర్లు, ఎక్స్‌కవేటర్లు ఇప్పుడు ప్రజా పనుల కోసం, అమరావతి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి” అని తెలిపారు.
2019లో మంగళగిరి ప్రజల తీర్పు తనకు పాఠం అయిందని, అప్పటి నుంచే ప్రజలతో అనుబంధం పెంచుకున్నానని లోకేశ్ చెప్పారు. 2024 ఎన్నికల్లో 91 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని తెలిపారు.
మంగళగిరిలో ఇంటి పట్టాలు, వంద పడకల ఆసుపత్రి, స్మశానాల అభివృద్ధి, కమ్యూనిటీ భవనాలు, తాగునీరు, డ్రైనేజీ వంటి ప్రాజెక్టులు అమలవుతున్నాయని వివరించారు. “జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్‌ను మంగళగిరిలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఎంత పని ఒత్తిడి ఉన్నా ముందుగా మంగళగిరికే ప్రాధాన్యత ఇస్తాను” అని హామీ ఇచ్చారు.
గూగుల్ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో, డీలర్‌షిప్‌లు కూడా అంతే ప్రాధాన్యం కలిగి ఉన్నాయన్నారు. “ఇలాంటి సంస్థలు ఉద్యోగావకాశాలను పెంచుతాయి. గూగుల్ వంటి సంస్థలు విజయవంతం కావాలంటే ఎకోసిస్టమ్ అవసరం — అందుకు ఈ రకమైన సర్వీస్ సెంటర్లు, డీలర్‌షిప్‌లు కీలకం” అని వివరించారు.
టాటా హిటాచీ ఎండీ సందీప్ సింగ్, లక్ష్మీ గ్రూప్ చైర్మన్ కంభంపాటి రామ్మోహన్ రావు, ఎండీ జయరాం, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.