Nara lokesh: అహంకారమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని 151 స్థానాల నుంచి కేవలం 11 సీట్లకు పరిమితం చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. అమరావతిలో ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వ పాలన పూర్తిగా అరాచకంగా ఉందన్నారు.
తాము పార్టీ కార్యాలయాన్ని పవిత్ర దేవాలయంగా భావిస్తున్నామని, కానీ వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ కార్యాలయం మీద దాడి చేసినా ఎవ్వరు స్పందించలేదని మండిపడ్డారు. ప్రజలే తాము అధికారంలో ఉండాలా లేక ప్రతిపక్షంలో ఉండాలా అన్నది నిర్ణయిస్తారన్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష భావనతో పని చేయాలని కార్యకర్తలకు సూచించారు.
ఆర్థిక సమస్యల మధ్యలోనే ‘తల్లికి వందనం’ వంటి ప్రజా ప్రయోజన పథకాలను అమలు చేయగలిగామని, తమ పార్టీ కార్యకర్తలు చేసిన కృషిని ఎప్పటికీ మర్చిపోమని స్పష్టం చేశారు. పార్టీలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.
పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనుబంధ విభాగాలను శక్తివంతం చేస్తామని, సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టంగా తీర్చిదిద్దేందుకు అన్ని స్థాయిల కమిటీలను వచ్చే నెల 5 నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు. పార్టీ సీనియర్ల అనుభవాన్ని, యువత శక్తిని సమన్వయపరచి పార్టీ ముందుకు తీసుకెళ్లేలా కృషి చేస్తామని చెప్పారు. గత నాలుగు దశాబ్దాల్లో పార్టీని ముందుకు నడిపించిన వారు సీనియర్లే అని కొనియాడారు.
ఈ ఏడాది పాలనలో ప్రభుత్వం చేసిన సేవల్ని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు నారా లోకేశ్ పిలుపునిచ్చారు.