Nara Lokesh: దేశవ్యాప్తంగా విద్యా ప్రమాణాలపై యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ASER-అసర్) నివేదిక విడుదలైన సంగతి తెలిసిందే. 2022-24 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యా ప్రమాణాలు క్షీణించాయని ఈ నివేదిక స్పష్టంగా తెలిపింది. ఈ నేపథ్యంలో, ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు.
అసర్ నివేదిక ద్వారా జగన్ మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎలా విపత్తుకు గురయ్యిందో వెల్లడైందని ఆయన పేర్కొన్నారు. విద్యా రంగానికి కేవలం ప్రచార హంగులు జోడించి వందల కోట్లు ఖర్చు చేసినప్పటికీ, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం కనీస చర్యలు కూడా తీసుకోలేదని ఆయన విమర్శించారు.
2018లో మెరుగైన పరిస్థితి – వైసీపీ పాలనలో క్షీణత
“2018లో తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగుండేది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసర్ నివేదిక ప్రకారం, ప్రభుత్వ పాఠశాలలు మూతపడటం, విద్యార్థుల హాజరు శాతం తగ్గిపోవడం, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాల లేకపోవడం విద్యా వ్యవస్థ క్షీణతకు నిదర్శనం” అని లోకేశ్ అన్నారు.
“అత్యంత దురదృష్టకరం ఏమిటంటే, ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో సగానికి పైగా రెండో తరగతి పాఠాలు సరిగ్గా చదవలేని స్థితిలో ఉన్నారు. ఇది వైసీపీ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎంత నాశనమైందో చూపిస్తోంది” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
“గత ఏడాది నుంచి విద్యా వ్యవస్థను పునరుద్ధరించేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాను. అధికారులతో క్రమం తప్పని సమీక్షలు నిర్వహిస్తూ, విద్యా వ్యవస్థలో ఉన్న అసలైన సమస్యలను తెలుసుకుంటున్నాను. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను ఖచ్చితంగా లెక్కించడం, ఆధునిక అవసరాలకు తగ్గట్టు పాఠ్య ప్రణాళిక రూపొందించడం, విద్యార్థులను క్రీడలు, ఇతర రంగాల్లో ప్రోత్సహించేందుకు మార్గదర్శకాలు సిద్ధం చేయడం వంటి కీలక చర్యలు తీసుకుంటున్నాం” అని మంత్రి తెలిపారు.
త్వరలోనే “ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్” ను రూపొందించి, విద్యావేత్తలు, ప్రజల అభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురాబోతున్నట్లు లోకేశ్ స్పష్టం చేశారు.