Nara lokesh: ప్రధాని మోదీని కలిసిన మంత్రి నారా లోకేశ్

Nara lokesh: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్‌ నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా హస్తినలో కలిశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందించాలనే లక్ష్యంతో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.

ఈ సందర్భంగా లోకేశ్ రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం కోసం కేంద్రం అండగా నిలవాలని కోరారు. ఇప్పటికే సెమీ కండక్టర్ యూనిట్‌ను రాష్ట్రానికి మంజూరు చేసినందుకు ఆయన ప్రధానమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

విద్యా రంగంలో జరుగుతున్న సంస్కరణలపై వివరించిన లోకేశ్, ఉన్నత విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో కేంద్రం మార్గనిర్దేశం చేయాలని అభ్యర్థించారు. గడిచిన 15 నెలల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం అందిస్తున్న సహకారం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

“వికసిత్ భారత్ – 2047” లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కూడా భాగస్వామి అవుతుందని లోకేశ్ స్పష్టం చేశారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మందికి మేలు చేకూర్చినందుకు ప్రధానిని అభినందించారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలను కూడా లోకేశ్ ప్రధానికి వివరించినట్లు సమాచారం.

లోకేశ్ విజ్ఞప్తులపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశం ముగింపులో, రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ‘యోగాంధ్ర’ కాఫీ టేబుల్ బుక్‌ను లోకేశ్ ప్రధానికి అందజేశారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *