Nara lokesh: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి దిశగా చారిత్రక అడుగులు పడుతున్నాయని, గత 18 నెలలుగా రాష్ట్రంలో ఓ ప్రత్యేకమైన “మ్యాజిక్” జరుగుతోందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆ మ్యాజిక్ వెనుక ఉన్న రహస్యం ఏమిటని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రశ్నిస్తున్నారని ఆయన వెల్లడించారు. భోగాపురం సమీపంలో ఏర్పాటు కానున్న జీఎంఆర్–మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీకి సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో, మాన్సాస్ ట్రస్ట్ సహకారంతో జీఎంఆర్ సంస్థ భీమిలి మండలం అన్నవరం వద్ద 136.63 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఏవియేషన్ ఎడ్యుసిటీని అభివృద్ధి చేయనుందని లోకేశ్ తెలిపారు. ప్రపంచ సివిల్ ఏవియేషన్ రంగంలో వర్క్‌ఫోర్స్‌లో 25 శాతం తెలుగువారే ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, “మా దగ్గర మిస్సైల్స్, జీపీఎస్ ఉన్నాయి. అయ్యన్నపాత్రుడు, అశోక్ గజపతిరాజు వంటి అనుభవజ్ఞులైన నాయకులు మాకు జీపీఎస్‌లా దారి చూపిస్తుంటే, రామ్మోహన్ నాయుడు, అదితి గజపతిరాజు వంటి యువ నాయకులం మిస్సైల్స్‌లా దూసుకుపోతున్నాం. మేం చరిత్ర సృష్టిస్తున్నాం” అని అన్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని పేర్కొన్నారు.
జీఎంఆర్ సంస్థల అధినేతను ‘ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ’గా అభివర్ణించిన లోకేశ్, ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, పదో తరగతి ఫెయిల్ అయినప్పటికీ పట్టుదలతో ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తగా ఎదగడం ప్రశంసనీయమన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు అవసరమా అని అప్పట్లో ఎగతాళి చేసినవారే, నేడు ఆ ఎయిర్‌పోర్ట్ తెలంగాణ జీడీపీలో 12 శాతం వాటా అందిస్తోందని గుర్తుచేశారు. విజన్ ఉన్న నాయకులను విజన్ లేనివారు ఎప్పుడూ ఎగతాళి చేస్తారని వ్యాఖ్యానించారు.
ఈ ప్రాజెక్టుకు మాన్సాస్ ట్రస్ట్ ఉచితంగా భూమిని అందించడాన్ని లోకేశ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రపంచ స్థాయి సంస్థ వస్తే భూమిని ఉచితంగా ఇస్తామని మాన్సాస్ ట్రస్ట్ ముందుకు రావడం గొప్ప మనసుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీసం రూపాయి అయినా తీసుకోవాలని సూచించినా, ట్రస్ట్ అంగీకరించలేదని తెలిపారు. పూసపాటి వంశీయులు వేలాది ఎకరాలను ప్రజల కోసం దానం చేసిన గొప్ప చరిత్ర కలిగినవారని అన్నారు.
కూటమి ప్రభుత్వం ‘ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ’ విధానంతో ముందుకు సాగుతోందని లోకేశ్ పునరుద్ఘాటించారు. చైనా తరహాలో క్లస్టర్ విధానంతో రాష్ట్రవ్యాప్తంగా 20కి పైగా అభివృద్ధి క్లస్టర్లను ఏర్పాటు చేసి, విద్యను పరిశ్రమలతో అనుసంధానం చేస్తామని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
99 పైసలకే భూములు కేటాయించడంవల్ల విశాఖకు టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు వచ్చాయని, రాబోయే 100 రోజుల్లో మరో రెండు పెద్ద ఐటీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనున్నాయని లోకేశ్ తెలిపారు. ఏవియేషన్ ఎడ్యుసిటీని కేవలం 12 నెలల్లో పూర్తి చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ పి. అశోక్ గజపతిరాజు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ ఛైర్మన్ జీబీఎస్ రాజు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అదితి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.
