Nara Bhuvaneshwari: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు భార్య, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. శాంతిపురం, రామకుప్పం మండలాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె పర్యటనలో ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి.
ఆధార్ లేక RTC బస్సులో టికెట్ కొనుగోలు
కడపల్లె నుంచి తుమ్మిశి చెరువు వరకు మహిళలతో కలిసి భువనేశ్వరి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ‘స్త్రీ శక్తి’ పథకం అమలు ఎలా జరుగుతుందో తెలుసుకునే క్రమంలో మహిళలతో మాట్లాడారు. ఉచిత ప్రయాణానికి ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో, మహిళా కండక్టర్ ఆమెను ఆధార్ కార్డు చూపించమని అడిగింది.
అప్పటికి భువనేశ్వరి తన వద్ద ఆధార్ లేదని, ఫోన్‌లో ఉన్న కార్డు కూడా ఇంట్లో మర్చిపోయానని తెలిపింది. దీంతో నిబంధనల ప్రకారం టికెట్ తీసుకోవాలని కండక్టర్ సూచించగా, భువనేశ్వరి వెంటనే డబ్బులు చెల్లించి టికెట్ కొనుగోలు చేసింది.
ఈ సంఘటన బస్సులో ప్రయాణించిన వారిని ఆశ్చర్యచకితులను చేసింది.
“చంద్రబాబు బిజీ… అందుకే నేను వస్తున్నా”
తరువాత నడింపల్లెలో జరిగిన సభలో భువనేశ్వరి మాట్లాడుతూ: రాష్ట్ర అభివృద్ధి పనులతో చంద్రబాబుకు తీరిక లేదని అందుకే ఆయన తరపున ప్రతి మూడు నెలలకు ఒకసారి తాను కుప్పం వస్తానని ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపేలా ట్రస్ట్ ద్వారా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తమిళ జనాభా అధికంగా ఉండే ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె ప్రసంగాన్ని “ఎలారిక్కుం సౌగ్యమా?” (అందరూ బాగున్నారా?) అంటూ ప్రారంభించగా, సభలో ఉన్నవారు చప్పట్లతో స్పందించారు.
కొలాటం ఆడి ప్రజలను ఆకట్టుకున్న భువనేశ్వరి
ఈ పర్యటనలో భాగంగా భువనేశ్వరి మహిళలతో కలిసి కొలాటం కూడా ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు.
తర్వాత తుమ్మిశి, విజలాపురం చెరువుల వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.అలాగే కెనమాకులపల్లెలో మొక్కలు నాటి, పర్యావరణాన్ని రక్షించే బాధ్యత అందరిదేనని పిలుపునిచ్చారు.

