Nandamuri Padmaja: తెలుగు సినీ ప్రపంచానికి ఎనలేని గుర్తింపు తీసుకొచ్చిన నందమూరి కుటుంబంలో మరోసారి తీవ్ర విషాదం నెలకొంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ గారి భార్య పద్మజ (73) ఈరోజు అనారోగ్యంతో కన్నుమూశారు.
కుటుంబానికి తీరని లోటు
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పద్మజ ఈ ఉదయం ఆకస్మికంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొన్నారని కుటుంబ వర్గాలు వెల్లడించాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, వైద్యులు ఆమెను కాపాడలేకపోయారు. దీంతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
రెండు కుటుంబాలపై దుఃఖం
పద్మజ గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి కాగా, యువ హీరో నందమూరి చైతన్య కృష్ణ తల్లి కూడా. ఈ మరణంతో నందమూరి కుటుంబం మాత్రమే కాకుండా దగ్గుబాటి కుటుంబంలోనూ తీవ్ర శోకం వ్యాపించింది.
ఇది కూడా చదవండి: Asia Cup 2025: చోటు దక్కేది ఎవరికి.. ఆసియాకప్‌నకు భారత జట్టు ఎంపిక నేడే
ముఖ్యుల సంతాపం
ఈ వార్త తెలిసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. అలాగే దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీ నుంచి బయలుదేరినట్లు సమాచారం. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పద్మజ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు.
సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ
నందమూరి కుటుంబం అనగానే సినీ ఇండస్ట్రీలో నాలుగు తరాల హీరోలు గుర్తుకు వస్తారు. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి వారు తెలుగు సినిమాకు వెలకట్టలేని సేవలు అందించారు. అలాంటి కుటుంబంలో మరోసారి విషాదం చోటుచేసుకోవడం అభిమానులను కలచివేస్తోంది.