Balakrishna: గత కొంతకాలంగా నటసింహ నందమూరి బాలకృష్ణ జోరు ఏ మాత్రం తగ్గడం లేదని సినీజనం అంటున్నారు… ఓ వైపు సినిమాల్లో వరుస విజయాలు – మరోవైపు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ‘హ్యాట్రిక్’… ఇంకోవైపు సామాజిక సేవలోనూ ‘బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి’ ద్వారా సేవలు – ఇలా సాగుతున్నారు బాలకృష్ణ… ఆయన కీర్తి కిరీటంలో ‘పద్మభూషణ్’ పురస్కారం చేరుతోంది… ‘పద్మభూషణుడు’ కాబోతున్న బాలయ్య కళాసేవను ఒక్కసారి గుర్తు చేసుకుందాం…
కళారంగం నుండి బాలకృష్ణకు ‘పద్మభూషణ్’ అవార్డు లభిస్తోంది… బాలయ్యకు ‘పద్మభూషణ్’ అని ప్రకటన రాగానే దేశవిదేశాల్లో ఉన్న ఆయన అభిమానుల్లో ఆనందం అంబరమంటింది… ఊరూరా వాడవాడలా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు… ఈ మధ్యే నటునిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న బాలయ్య ‘పద్మభూషణుడు’ కాబోవడం మరింత విశేషంగా మారింది…
తెలుగు చలన చిత్రసీమలోనే కాదు యావద్భారతంలో ఏకధాటిగా యాభై ఏళ్ళు నటిస్తూనే ఉన్న నటవారసుడు మరొకరు కానరారు… 1974లో బాలనటునిగా ‘తాతమ్మకల’లో అడుగు పెట్టింది మొదలు – ప్రతి యేటా బాలయ్య నటిస్తూనే ఉన్నారు… కొన్నిసార్లు సినిమాల విడుదలలో జాప్యం జరిగి ఉండవచ్చు… కానీ, ఆయన మాత్రం ఏకధాటిగా నటిస్తూ ఉండడం విశేషం! అందునా ఓ నటవారసుడు ఐదు దశాబ్దాలు కంటిన్యూగా నటించడమన్నది బాలయ్య విషయంలోనే చూస్తాం… అలా బాలకృష్ణ తన ప్రత్యేకతను చాటుకున్నారు… అలాంటి బాలయ్యకు కేంద్రప్రభుత్వం ‘పద్మభూషణ్’ ప్రకటించగానే ఆయన అభిమానులు పరమానందం చెందారు…
Balakrishna: ఓ సెలబ్రిటీకి ఏ అవార్డు దక్కినా, ఏదైనా గౌరవం లభించినా ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి… బాలకృష్ణకు ‘పద్మభూషణ్’ ప్రకటించగానే అదే తీరున కొందరు తుంటరులు ప్రవర్తించారు… అయితే నటునిగా, వ్యక్తిగా బాలయ్య గురించి తెలిసిన వారు మాత్రం ఆయనకు ఈ అవార్డు ఎప్పుడో రావలసింది అంటున్నారు… నిజానికి బాలకృష్ణ కంటే తరువాత సినిమారంగంలో ప్రవేశించిన వారు సైతం ‘పద్మభూషణ్, పద్మవిభూషణ్’ అవార్డులు సొంతం చేసుకున్నారు… బాలయ్యకు చిత్రసీమలోనే కాదు రాజకీయంగానూ ఎంతో పలుకుబడి ఉన్నా ఆయన ఏ నాడూ అవార్డుల కోసం అదే పనిగా కృషి చేసింది లేదు… ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండడం, అందునా కేంద్రంలోని బీజేపీ మిత్రపక్షంగా వారి పార్టీ ఉండడం వల్లే బాలయ్యకు ‘పద్మభూషణ్’ దక్కింది అనుకుంటే పొరబాటే!… ఎందుకంటే తన తండ్రి యన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కానీ, బావ చంద్రబాబు నాయుడు పవర్ చెలాయిస్తున్నప్పుడు కానీ ఏ నాడూ బాలయ్య అవార్డులకు ఆశ పడింది లేదు… బాలయ్య జనం చేత జేజేలు అందుకున్న చిత్రాల ద్వారానే ఉత్తమ నటునిగా నిలిచారు… అవార్డులు గెలిచారు… ఇప్పుడు కూడా ఓ కళాకారునిగా జనం మదిని గెలిచి మరీ ‘పద్మభూషణుడ’య్యారు…
భారతదేశంలోనే కాదు ఆ మాటకొస్తే ప్రపంచంలోనే నటవారసుల్లో బాలకృష్ణలా బహుముఖంగా తన కళను ప్రదర్శించిన వారిని చూడబోము… ఎందుకంటే, తన తండ్రి యన్టీఆర్ నటవారసత్వం అందిపుచ్చుకొని పౌరాణిక, జానపద, చారిత్రకాల్లోనూ బాలకృష్ణ జయకేతనం ఎగురవేశారు… ఇక సాంఘిక చిత్రాలలో తనదైన బాణీ పలికిస్తూ ఎన్నెన్నో విజయాలను సొంతం చేసుకున్నారాయన… వైవిధ్యమైన పాత్రలతోనూ బాలయ్య అలరించిన తీరును ఎవరూ మరచిపోలేరు…
‘కళ కళ కోసం ప్రజాశ్రేయస్సు కోసం’ అంటూ సాగారు యన్టీఆర్… ఆయన చూపిన బాటలోనే బాలకృష్ణ సైతం తన నటనతో జనాన్ని అలరిస్తూనే సామాజిక సేవలోనూ తరిస్తున్నారు… ఓ వైపు హిందుపురం నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ‘హ్యాట్రిక్’ సాధించారు… మరోవైపు తండ్రి నెలకొల్పిన ‘బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్’ ఛైర్మన్ గానూ తనదైన రీతిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు… అంతేకాదు పేదవారికి తమ ఆసుపత్రి ద్వారా ఉచిత వైద్యం అందేలా చూస్తున్నారు… ఆ తీరున తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ బాలయ్య ఓవైపు కళారంగంలోనూ, మరోవైపు రాజకీయరంగంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు… ఆ తీరున చూసినా ఏ నటవారసుడూ బాలయ్య దరిదాపుల్లో కానరారు…
Balakrishna: ఓ నటవారసుడు తన తండ్రి బయోపిక్ ను తెరకెక్కిస్తూ అందులో తానే తండ్రి పాత్రను పోషించడమన్నది కూడా బాలకృష్ణ కెరీర్ లోనే చూస్తాం… ఆ తీరున యన్టీఆర్ బయోపిక్ ను ‘కథానాయకుడు, మహానాయకుడు’ అంటూ సీక్వెల్ గా నిర్మించి నటించి తనదైన బాణీ పలికించారు బాలకృష్ణ…
కళారంగం, సేవారంగం, రాజకీయరంగం – ఈ మూడింటిలో బాలకృష్ణ అందించిన సేవలకు ఆయనకు ఏ నాడో ‘పద్మ’ అవార్డు దక్కాలన్నది అభిమానుల అభిప్రాయం… ఏమైతేనేం బాలకృష్ణ నటునిగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను ‘పద్మభూషణ్’ వరించడం కూడా విశేషమే అని ఆనందిస్తున్నారు కొందరు…
నిజానికి యన్టీఆర్ తాను చిత్రసీమలో అడుగు పెట్టిన ఇరవై ఏళ్ళకే ‘పద్మశ్రీ’ పురస్కారం సొంతం చేసుకున్నారు…ఆ రోజుల్లో భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక అవార్డులను సినిమా కళాకారులకు అందించడంలో తటపటాయించేవారు… పైగా ఉత్తర, దక్షిణ అన్న తేడాలూ చూపించేవారు… ఇవేవీ పట్టించుకోకుండా యన్టీఆర్ తనకు లభించిన వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ సాగారు… యన్టీఆర్ ను విశేషంగా అభిమానించేవారు సిఫార్సు చేయడం వల్ల అనితరసాధ్యంగా సాగుతున్న ఆయన అభినయ వైభవాన్ని చూసి ‘పద్మశ్రీ’ అందించారు… బాలయ్య విషయంలోనూ అదే జరిగిందని చెప్పవచ్చు… ఇన్నాళ్ళకు బాలయ్య ఫ్యాన్స్ కు ఆనందం కలిగిస్తూ కేంద్రప్రభుత్వం ఆయనను పద్మభూషణుడిని చేసింది…
బాలకృష్ణ అదృష్టవశాన ఈ స్థాయికి చేరుకోలేదు… వృత్తిపట్ల బాలయ్యలోని అంకితభావం- తండ్రి నేర్పించిన క్రమశిక్షణ – తాను అలవరచుకున్న కృషి, దీక్ష, పట్టుదల- ఇవన్నీ కలసి బాలయ్య విజయ పర్వానికి సోపానాలుగా నిలిచాయని చెప్పవచ్చు…
Balakrishna: ఆరంభంలో బాలయ్య తండ్రి చాటు బిడ్డగా ఉన్నారు… పిన్నవయసులోనే నటునిగా మంచి మార్కులు సంపాదించారు… సోలో హీరోగా చిత్రసీమలో అడుగు పెట్టే నాటికి ఏ నటవారసుడికీ ఎదురుకాని పరిస్థితి బాలయ్యకే ఏర్పడింది… మహానటుడు యన్టీఆర్ నటవారసుడు కావడంతో ఆ ఇమేజ్ కు తగ్గట్టుగా సాగాల్సిన పరిస్థితి ఒకవైపు… అప్పటికే యన్టీఆర్ రాజకీయాల్లో ఉండడంతో ఆయన ప్రతిపక్షం బాలయ్య కెరీర్ నాశనం చేయాలని ప్రయత్నించింది… ఇలాంటి స్థితిలోనూ చెదరక బెదరక ముందుకు సాగారు బాలయ్య… ‘మంగమ్మగారి మనవడు’ ఘనవిజయంతోనే తన విజయాలకు శ్రీకారం చుట్టారాయన…
బాలయ్య సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు వరుసగా మూడు పరాజయాలు పలకరించాయి… ఫ్లాపులతో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్యను చూసి జనం నవ్వుకున్నారు… ఇక వైరిపక్షం వెకిలిగా నవ్వింది… బాలయ్య పని అయిపోయిందనీ చాటింపు వేసింది… అభిమానులు మాత్రం బాలయ్య స్టార్ అయితీరతాడు అనే నమ్మకంతో ఉన్నారు… వారి అభిలాషను నెరవేరుస్తూ బాలయ్య ‘మంగమ్మగారి మనవడు’గా జయకేతనం ఎగురవేశారు… ఆ సినిమాతోనే బాలయ్య నటజీవితంలో రికార్డుల పర్వం మొదలయింది…
ఆరంభంలోనే పరాజయాలతో పచార్లు చేసిన బాలయ్యకు తరువాత మరపురాని విజయాలు సొంతమయ్యాయి… ‘మంగమ్మగారి మనవడు’ విడుదలైన ఏడాదే బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘కథానాయకుడు’ సైతం బంపర్ హిట్ గా నిలచింది… దాంతో బాలయ్యను చూసి నవ్వినవారు సైతం జేజేలు కొట్టడం మొదలెట్టారు…
Balakrishna: పౌరాణికాలంటే తెలుగువారికే సాధ్యం అని అందరికీ తెలుసు… అందునా అది నందమూరి తారకరామునికి మరింత సాధ్యమైందనీ అందరూ అంగీకరిస్తారు … యన్టీఆర్ నటవారసునిగా బాలకృష్ణ సైతం పౌరాణిక పాత్రలతో అలరించారు… స్టార్ అయిన తరువాత కూడా తండ్రిని తలపిస్తూ కొన్ని పౌరాణిక పాత్రలలో కనిపించి మురిపించారు…
యన్టీఆర్ తరువాత రకరకాల గెటప్స్ తో అలరించే సత్తా తనకే ఉందని లోకానికి చాటారు బాలకృష్ణ… ఆ సమయంలోనూ యన్టీఆర్ రాజకీయ ప్రత్యర్థులు బాలయ్య అభినయం చూసి గేలి చేశారు… అందరికీ సమాధానం చెబుతూ బాలయ్య జైత్రయాత్ర సాగించారు… ఆయన వరైటీ గెటప్స్ చూసి జనం జేజేలు పలికారు…
తండ్రిని తలపిస్తూ బాలకృష్ణ తనదైన రీతిలో కొన్ని పౌరాణిక పాత్రల్లో జనం ముందు నిలిచారు… యన్టీఆర్ అభినయంతో పోల్చలేదు కానీ, బాలయ్యను సైతం సదరు పాత్రల్లో చూసిన ప్రేక్షకులు సాహో అన్నారు… తన తరం స్టార్ హీరోస్ లో తనకు మాత్రమే సాధ్యమనిపిస్తూ కొన్ని వరైటీ రోల్స్ లో బాలయ్య అలరించిన తీరు అనితర సాధ్యం అనిపించక మానదు…
నవ్విన నాపచేనే పండుతుందంటారు… బాలకృష్ణను చూసి నవ్విన కొందరు తరువాత ఆయన అభినయాన్ని చూసి ఔరా అన్నారు… రాజకీయంగా బాలయ్యను ఎంతగానో ద్వేషించినా, ఆయన నటనను చూసి మురిసిపోయిన వారున్నారు… నటరత్న వంటి ఘనచరిత గల నటుని వారసుడైనా స్వశక్తితోనే నిలదొక్కుకున్నారు బాలయ్య… అదే ఆయనను టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ప్రత్యేకంగా నిలిపింది…
Balakrishna: తెలుగునాట ఓ నటవారసుడు సోలో హీరోగా అడుగు పెట్టిన సంవత్సరంలోనే ప్లాటినమ్ జూబ్లీ చూడడమన్నది బాలకృష్ణకే చెల్లింది… ఈ నాటికీ ఈ అరుదైన రికార్డును తిరగాసిన వారెవరూ లేకపోవడం గమనార్హం! 1984 జూన్ లో సోలో హీరోగా జనం ముందు నిలచిన బాలకృష్ణ ఆరంభంలో మూడు పరాజయాలు చూసి, నాల్గవ చిత్రం ‘మంగమ్మగారి మనవడు’తో బంపర్ హిట్ ను అందుకున్నారు… ఆ సినిమా హైదరాబాద్ లో 560 రోజులు మూడు ఆటలతో ప్రదర్శితమై ఓ రికార్డు నెలకొల్పింది… ఈ నాటికీ భాగ్యనగరంలో ‘మంగమ్మగారి మనవడు’ స్థాయిలో రన్నింగ్ చూసిన తెలుగు చిత్రం మరొకటి కనిపించదు…
బాలకృష్ణ అనేక విజయాలు తండ్రి యన్టీఆర్ సక్సెస్ ను తలపిస్తూ ఉంటాయి… 1965లో యన్టీఆర్ నటించిన 8 చిత్రాలు విజయం సాధించి ఈ నాటికీ రికార్డుగా నిలిచాయి… అదే తీరున బాలకృష్ణ 1986లో నటించిన ఆరు చిత్రాలు వరుసగా జయకేతనం ఎగురవేశాయి… “ముద్దుల క్రిష్ణయ్య, సీతారామకళ్యాణం, అనసూయమ్మగారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు” చిత్రాలు బాలయ్యకు ఆ ఘనకీర్తిని సంపాదించి పెట్టాయి…
యన్టీఆర్ తరువాత తెలుగు చిత్రసీమలో అత్యధిక స్వర్ణోత్సవ చిత్రాలు కలిగిన హీరోగానూ బాలకృష్ణ చరిత్ర సృష్టించారు… ఆయన హీరోగా రూపొందిన “మంగమ్మగారి మనవడు, ముద్దుల క్రిష్ణయ్య, ముద్దుల మావయ్య, సమరసింహారెడ్డి, లెజెండ్” చిత్రాలు గోల్డెన్ జూబ్లీ హిట్స్ గా నిలిచాయి…
Balakrishna: ఓ స్టార్ హీరో నటించిన రెండు చిత్రాలు 500 రోజులకు పైగా ప్రదర్శితం కావడం ఒక్క బాలకృష్ణకే చెల్లింది… ఆ రెండు సినిమాలేవంటే ‘మంగమ్మగారి మనవడు’, ‘లెజెండ్’ – వీటిలో మంగమ్మగారి మనవడు 560రోజులు ఆడితే, ‘లెజెండ్’ ఏకంగా వేయి రోజులు ప్రదర్శితమయింది… దక్షిణాదిన వెయ్యి రోజులకు పైగా ప్రదర్శితమైన ఏకైక చిత్రంగా ‘లెజెండ్’ నిలవడం విశేషం!
తండ్రి యన్టీఆర్ లాగే జానపద, పౌరాణిక, చారిత్రకాల్లోనూ శతదినోత్సవాలు చూసిన ఏకైక హీరోగా బాలకృష్ణ నిలిచారు… ఆయన హీరోగా రూపొందిన ‘భైరవద్వీపం’ తన తరం హీరోల్లో జానపద చిత్రాల్లో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం చూసిన సినిమాగా నిలచింది… ఇక శ్రీరామచంద్రుని పాత్రలో బాలయ్య అలరించిన ‘శ్రీరామరాజ్యం’ చిత్రం కూడా వందరోజులు చూసింది… అలాగే చారిత్రక చిత్రాల్లో నూరు రోజులు ప్రదర్శితమైన ఇప్పటి సినిమాగా బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ జనం మదిని గెలిచింది… ఇలాంటి అరుదైన ఘనత బాలయ్యకు మాత్రమే దక్కిందని సాటి స్టార్స్ సైతం ప్రశంసిస్తూ ఉండడం విశేషం!
తెలుగు సినిమా స్లంప్ చూస్తున్న సమయంలో పలుమార్లు బాలయ్య నటించిన సినిమాలే జయకేతనం ఎగరేసి అలరించాయి… అదే తీరున కరోనా కల్లోలం తరువాత థియేటర్లకు జనం రావడానికే భయపడుతున్న సమయంలో బాలయ్య ‘అఖండ’ మళ్ళీ ప్రేక్షకులను సినిమా హాళ్ళకు పరుగులు తీసేలా చేసింది… ఆ తరువాతే మిగతా హీరోలు తమ చిత్రాలను ధైర్యంగా విడుదల చేయగలిగారు…
Balakrishna: ‘అఖండ’ ఘనవిజయంతో తొలిసారి తన కెరీర్ లో వంద కోట్ల క్లబ్ లో చేరిన బాలకృష్ణ అప్పటి నుంచీ వరుసగా వంద కోట్ల వసూళ్ళ చిత్రాలతో అభిమానులను అలరిస్తూ వస్తున్నారు… ‘అఖండ’ తరువాత బాలకృష్ణ నటించిన “వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్” అన్నీ వంద కోట్లకు పైగా సాధించిన చిత్రాలుగా నిలిచాయి… ఈ నేపథ్యంలో ‘అఖండ’ సీక్వెల్ లో ‘తాండవం’ చేయబోతున్నారు బాలకృష్ణ… ఇదే సమయంలో బాలయ్యను ‘పద్మభూషణ్’ వరించడం అభిమానులకు అమితానందం కలగచేస్తోంది… భవిష్యత్ లోనూ అభిమానులకు మరింత ఆనందం పంచుతూ బాలయ్య సాగుతారని టాలీవుడ్ జనం ఆశిస్తున్నారు…
“జై బాలయ్యా… జై జై బాలయ్యా…” అంటూ అభిమానులు ఆనందిస్తున్న సమయమిది… ‘పద్మభూషణు’డవుతున్న బాలకృష్ణ భవిష్యత్ లో మరిన్ని ఘనవిజయాలను సొంతం చేసుకోవాలని ‘మహా న్యూస్’ ఆశిస్తోంది… ఇదే తీరున బాలకృష్ణ జైత్రయాత్ర సాగాలనీ ఆశిద్దాం.