Feroz Khan: నాంపల్లి నియోజకవర్గంలో బోగస్ ఓట్ల వ్యవహారంపై కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఎంఐఎం పార్టీ బీజేపీకి ‘బీ-టీమ్’గా వ్యవహరిస్తోందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. నాంపల్లిలో డూప్లికేట్ ఐడీలతో దొంగ ఓట్లు సృష్టించారని, వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
‘ఎంఐఎం-బీజేపీ ఒకే నాణేనికి రెండు వైపులు’
ఫిరోజ్‌ఖాన్ మీడియాతో మాట్లాడుతూ… నాంపల్లి నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై తాను అనేకసార్లు అధికారులను కలిశానని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దొంగ ఓట్లన్నీ ఎంఐఎం పార్టీకి చెందినవేనని ఆరోపించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎంఐఎం, బీజేపీ రెండూ ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివని, ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు.
‘రాహుల్ గాంధీ ప్రధాని కావడం కష్టం’
“ఈ దొంగ ఓట్లను పట్టుకోకపోతే రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం కష్టం,” అని ఫిరోజ్‌ఖాన్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అక్రమాలకు తావు ఇవ్వకూడదని, వెంటనే బోగస్ ఓట్లను తొలగించి, నిజమైన ఓటర్లకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.