Nallagonda Congress: నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ హవా నడుస్తుంది అంటారు. వారిని కాదని ఆ పార్టీ ఎవరూ ముందుకెళ్లలేరు.. వెనక్కి మళ్లలేరు.. అన్నది ఆ పార్టీ క్యాడర్‌లోనూ వినిపించే మాట. తాజాగా కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్ష పదవి ఆ జిల్లాలో చిచ్చు రేపింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరుడైన గుమ్ముల మోహన్‌రెడ్డి కాకుండా బీసీ వర్గానికి చెందిన పున్న కైలాష్‌నేతకు దక్కింది. దీంతో గుమ్ముల మోహన్‌రెడ్డి ఏకంగా మీడియా సమావేశంలోనే తన అసంతృప్తిని వ్యక్తంచేశారు.
Nallagonda Congress: ఇదే సమయంలో ఆయన సీఎం రేవంత్‌రెడ్డిపై కూడా పరోక్షంగా ఆరోపణలు గుప్పించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడి అయి నల్లగొండకు వచ్చి తమ భుజంపై చేయి వేస్తే సంతోషించామని, తమకు పదవులే లేకుండా చేస్తాడని తాము ఆనాడు అనుకోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆనాటి నుంచే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గానికి పదవులు దక్కడం లేదని, రేవంత్‌రెడ్డి వర్గం అంటే మాత్రం పదవులు ఈజీగా వస్తున్నాయని ఆరోపించారు.
Nallagonda Congress: ఎంపీ పదవి విషయంలోనూ తాను పోటీ పడ్డానని, కానీ, తనకు కాకుండా క్రియాశీల రాజకీయాల్లో లేనివారికే ఆ పదవులు దక్కాయని పరోక్షంగా నల్లగొండ, భువనగిరి ఎంపీలను ఉద్దేశించి ఆరోపించారు. తాను మాత్రం బూత్‌స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పని చేస్తున్నానని, అయినా తనకు డీసీసీ అధ్యక్ష పదవి ఎందుకు దక్కలేదో ఆ దేవుడికే తెలియాలి అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాలోని పార్టీ నేతలు తనకే మద్దతు తెలిపారని, అయినా తనకు ఎందుకు పదవి దక్కలేదని ప్రశ్నించారు.
Nallagonda Congress: తాను కోమటిరెడడ్ఇ అనుచరుడిని కావడం వల్లే డీసీసీ అధ్యక్ష పదవి రాకుండా చేశారంటూ గుమ్ముల మోహన్‌రెడ్డి ఘాటుగా ఆరోపించారు. తొలి నుంచి తనకే ఆ పదవి దక్కుతుందని ఆశించినట్టు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తిడితేనే పదవులు వస్తాయని, నిబద్ధతతో జెండామోసిన నాయకులకు పదువులు రావని నిష్టూరమాడారు. కులమే తన పదవికి అడ్డుగా మారిందా? అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
Nallagonda Congress: కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా తాను నిబద్ధతతో పనిచేశానని గుమ్ముల మోహన్‌రెడ్డి చెప్పుకొచ్చారు. నల్లగొండ, నకిరేకల్, మిర్యాలగూడ, మునుగోడు, నాగార్జున సాగర్ నియోజకవర్గాల పరధిలోని నాయకులంతా అంటే జిల్లాలో 75 శాతం తన పేరే చెప్పినా ఎందుకు తనకు పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే ఇదిలా ఉండగా, డీసీసీ అధ్యక్ష పదవి వస్తే గుమ్ముల మోహన్‌రెడ్డి తనకు మించి ఎదుగుతాడేమోనని కోమటిరెడ్డియే ఆయనకు పదవి రాకుండా చేశారేమోనని కొందరు చెవులు కొరుక్కుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిలో మర్మమేమిటో కాలమే నిర్ణయించాలి.
గుమ్ముల మోహన్‌రెడ్డి మరో డిమాండ్‌ను లేవనెత్తారు. జిల్లా మంత్రులైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు వచ్చే 24 గంటల్లోగా పదవి ఇప్పించాలని మెలిక పెట్టారు. టీజీఎస్ ఆర్టీసీ చైర్మన్ పదవిని ఇప్పించాలని వారి ముందు తన డిమాండ్‌ను ఉంచారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల డీసీసీ అధ్యక్ష పదవి వివాదాస్పదం కాకున్నా, నల్లగొండ విషయంలో మాత్రం జిల్లా కాంగ్రెస్‌లో తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉన్నదని ఆ పార్టీ క్యాడరే చెప్పుకుంటుంది.
