Nagarkurnool: భార్యను ముక్కలుగా రంపతో కోసి, మూసీలో పడేసిన మేడిపల్లి ఘటనను అందరూ మాట్లాడుకుంటుండగానే మరో ఘోరం వినాల్సి వచ్చింది. ప్రేమించి, పెళ్లాడిన భార్యను కొన్నాళ్లకే అక్కడ అమానుషంగా హతమార్చాడు. ఇక్కడా ప్రేమ వివాహమే. ఇటీవల జరుగుతున్న ఒళ్లు గగుర్పొడిచే ఘోరాల్లో ఇదీ ఒకటిగా నిలుస్తుంది. భార్యను హతమార్చి, పెట్రోల్ పోసి తగులబెట్టిన రాక్షస చర్యలకు ఇక్కడి ఆమె భర్త పాల్పడ్డాడు.
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం రాయవరం గ్రామానికి చెందిన శ్రీశైలంకు రాంగ్‌నంబర్ కాల్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోటూరుకు చెందిన శ్రావణి (27) పరిచయమైంది. ఫోన్‌లో తరచూ మాట్లాడుకుంటూ ప్రేమలు పంచుకున్నారు. ఆ తర్వాత ఒక్కటవ్వాలనే నిర్ణయానికి ఇద్దరూ వచ్చారు. ఈ నేపథ్యంలో 2014వ సంవత్సరంలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
Nagarkurnool: శ్రీశైలం, శ్రావణి జంటకు ఒక కొడుకు, కూతురు కలిగారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. ఆ తర్వాత శ్రీశైలం జులాయిగా తిరగసాగాడు. అనుమానంతో భార్యను హింసించేవాడు. ఆమెపై అనుమానం పెనుభూతమైంది. ఈ క్రమంలో తరచూ గొడవలు జరుగుతుండటంతో వేగలేక భర్తపై వేధింపుల కేసు పెట్టింది. ఆ తర్వాత శ్రావణి భర్తను వదిలి పిల్లలతో కలిసి వేరేగా ఉండసాగింది.
Nagarkurnool: ఏడాది తర్వాత తాను మారిపోయానంటూ ఆగస్టు 21న భార్యకు ఫోన్ చేసి నమ్మబలికాడు. నమ్మిన శ్రావణి అతని వెంట వచ్చింది. ఈలోగా అతనిలో రాక్షస జాడలు వీడిపోలేదు. ఎలాగైనా శ్రావణిని కడతేర్చాలనే తన మనసులోనే నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఎక్కడికైనా తీసుకెళ్లి హతమార్చలని ప్లాన్ చేశాడు. అనుకున్నదే తడవుగా సోమశిల తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
Nagarkurnool: భర్త మాటలు నమ్మిన శ్రావణి సోమశిల వెళ్లేందుకు సిద్ధమైంది. బైక్‌పై ఇద్దరూ కలిసి సోమశిలకు బయలుదేరారు. మార్గమధ్యంలోకి వెళ్లాక, పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ సమీపంలో బైక్‌ను నిలిపాడు. సీతాఫలం పండ్లు తెచ్చుకుందామని సమీప అడవిలోకి భార్యను తీసుకెళ్లాడు. భర్త మారాడని, సంతోషంగా తనను టూర్ తీసుకెళ్తున్నాడనుకున్న శ్రావణి.. తనను హతమార్చేందుకే తీసుకెళ్తున్నాడని గమనించలేకపోయింది.
Nagarkurnool: అడవిలో కొద్దిదూరం వెళ్లగానే నిర్మానుష్యంగా ఉన్న చోట భార్య చున్నీని ఆమె మెడకే చుట్టి గొంతు నులిమాడు. ప్లాన్ ప్రకారం.. తన వెంట తెచ్చుకున్న కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. ప్లాన్‌లో భాగంగానే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి భార్యను తగులబెట్టాడు. ఆమె పూర్తిగా కాలిపోయాక, అక్కడి నుంచి శ్రీశైలం పరారయ్యాడు. తన కూతురు కనిపించడం లేదని శ్రావణి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ లోగానే తానే తన భార్యను చంపేశానని ఆమె భర్త శ్రీశైలం పోలీసులకు లొంగిపోయాడు.