Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా మాఫియా పంజా విసరడంతో ఎరువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అధికారికంగా రూ.260కి అందాల్సిన యూరియా బస్తా, బ్లాక్ మార్కెట్లో డబుల్ రేటు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యంగా పెద్దకొత్తపల్లి మండలంలో రోడ్డుపైనే యూరియా అమ్మకాలు బహిరంగంగా జరుగుతున్నాయి. రైతులు అధిక ధరలకు యూరియా కొనాల్సి రావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “సీజన్‌లో ఎరువులు అందకపోతే పంటలు ఎండిపోతాయి… కానీ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు” అని వారు మండిపడుతున్నారు.
ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న వ్యవసాయ శాఖ అధికారులు పెద్దకొత్తపల్లిలో దాడులు నిర్వహించి స్టాక్‌ను సీజ్ చేశారు. మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
రైతులు మాత్రం ప్రభుత్వం తక్షణమే యూరియా సరఫరా పెంచి బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.