Nagarjuna Sagar:తెలుగు ప్రజల అన్నపూర్ణగా పిలువబడే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీ ఎత్తున వరద ప్రవహిస్తున్నది. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు వరద పరుగులు పెడుతున్నది. ఇప్పటికే జూరాల, శ్రీశైలం నిండుకుండను తలపిస్తుండగా, నాగార్జున సాగర్ 564.4 అడుగులకు చేరుకున్నది. రెండు మూడు రోజుల్లో సాగర్ రిజర్వాయర్ నిండుతుందని, క్రస్ట్ గేట్లను తెరుస్తారని అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది.
Nagarjuna Sagar:జూరాల, సుంకేశుల బ్యారేజ్‌ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నది. విద్యుదుత్పత్తి ద్వారా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు 68 వేల క్యూసెక్కులను దిగువకు సాగర్‌కు విడుదల చేస్తున్నాయి. శ్రీశైలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 20 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా కోసం 1,013 క్యూసెక్కులను ఏపీకి విడుదల చేస్తున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తెలంగాణకు విడుదల చేస్తున్నారు.
Nagarjuna Sagar:నాగార్జన సాగర్ రిజర్వాయర్‌కు 67,800 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, 564.4 అడుగులకు చేరి 242.72 టీఎంసీలకు చేరుకున్నది. సాగర్ నిండాలంటే ఇంకా 69 టీఎంసీల నీరు అవసరం. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో మరో మూడు రోజుల్లో సాగర్ రిజర్వాయర్ నిండుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Nagarjuna Sagar:ఇదిలా ఉండగా ఎగువన ఆల్మట్టి డ్యామ్‌లోకి 94 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, 90 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ డ్యామ్‌కు 1.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, 1.01 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులోకి 1.15 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, 1.22 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర రిజర్వాయర్‌కు 39,339 క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే వరద నీటిని దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.

