Annapurna College: నటుడు, నిర్మాత మరియు అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా ఛైర్మన్ అక్కినేని నాగార్జున, ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణితో కలిసి మంగళవారం నాడు అత్యాధునిక ‘డాల్బీ అట్మాస్ 7.1.4 హెచ్‌ఈ’ (Dolby Atmos 7.1.4 HE) మిక్స్ ఫెసిలిటీని ప్రారంభించారు. వృత్తిపరమైన సౌండ్ ఎడ్యుకేషన్,ఇమ్మర్సివ్ ఆడియో ప్రొడక్షన్ రంగంలో ఈ స్టూడియో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.
సాంకేతికతతో కొత్త పుంతలు
ఈ నూతన డాల్బీ అట్మాస్ టెక్నాలజీతో కూడిన స్టూడియో విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు, సౌండ్ డిజైనర్లకు ప్రపంచ స్థాయి ఆడియో మిక్సింగ్, మాస్టరింగ్‌ను అనుభవించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఆధునిక 7.1.4 హెచ్‌ఈ సౌండ్ స్టూడియో ద్వారా సినిమా మేకర్లు స్పేషియల్ ఆడియో (Spatial Audio) సమకాలీన సౌండ్ డిజైన్ పద్ధతులను లోతుగా అధ్యయనం చేయవచ్చు.
సినిమాకు ప్రాణం సౌండ్: నాగార్జున
ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. “అన్నపూర్ణ కాలేజీలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 7.1.4 మిక్స్ ఫెసిలిటీ అందుబాటులోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సినిమాకు సౌండ్ ప్రాణం పోస్తుంది. నేటి సినిమా టెక్నాలజీతో నడుస్తోంది. అందుకే మా కాలేజీలో విద్యార్థులకు ఎప్పుడూ లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉండేలా మేము నిరంతరం కృషి చేస్తున్నాం” అని పేర్కొన్నారు.
సౌండ్ సినిమా ఆత్మ: ఎం. ఎం. కీరవాణి
స్టూడియోలోని డెమోను తిలకించిన కీరవాణి, సౌండ్ డిజైన్‌లోని మెళకువలను విద్యార్థులకు వివరించారు. “సౌండ్ అనేది సినిమాకి ఆత్మ. చక్కని సౌండ్ స్కేప్ భావోద్వేగాలను పండిస్తుంది, కథనంలో లోతును పెంచుతుంది. ప్రేక్షకుల అనుభవాన్ని మార్చివేస్తుంది. ఇటువంటి అత్యాధునిక సదుపాయాలు సృజనాత్మకతను ప్రేరేపిస్తాయి. విద్యార్థులు ఇలాంటి ప్రపంచ స్థాయి వాతావరణంలో నేర్చుకోవడం, ప్రయోగాలు చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది” అని ఆయన అన్నారు.
