Nagarjuna: మోదీ మళ్లీ పీఎం కావాలి

Nagarjuna: ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రేపు (సెప్టెంబర్ 17) ప్రధాని మోదీ 75వ జన్మదినం సందర్భంగా, 2014లో జరిగిన తొలి భేటీ జ్ఞాపకాలను ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

నాగార్జున విడుదల చేసిన వీడియోలో, 2014లో గాంధీనగర్‌లో తొలిసారి మోదీని కలిసినప్పుడు ఆయన ఇచ్చిన సలహా తన జీవితాంతం గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ఆ సమావేశంలో మోదీ మాట్లాడుతూ,

“నా స్నేహితుల పిల్లలు మీతో ఫోటో దిగినప్పుడు మీరు ఎంతో ఆప్యాయంగా పిలిచి వారితో ఫోటో దిగారని చెప్పారు. మీ చుట్టూ భద్రత ఉన్నా అలా చేయడం వాళ్లకు బాగా నచ్చింది. మీలో ఉన్న ఆ వినయాన్ని, సహానుభూతిని ఎప్పటికీ వదులుకోవద్దు” అని సూచించారని నాగార్జున గుర్తుచేశారు.

ఆ చిన్న విషయాన్ని కూడా ప్రధాని గుర్తుపెట్టుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని చెప్పారు. అలాగే తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయనను స్మరించుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.

దేశం కోసం మోదీ ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడిన నాగార్జున, ప్రధానికి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

“సర్, మీరు ఆరోగ్యంగా ఉండాలి. భారతదేశానికి మీరు మళ్లీ కావాలి, దేశానికి మీ అవసరం ఉంది” అని తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో పోస్ట్ చేశారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *