Nagarjuna: సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “కూలీ” చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, “రజనీ సార్ చెప్పినట్టు ఎప్పుడూ మంచివాళ్లుగానే కనిపించడం సరిపోదు. ‘కూలీ’లోని సైమన్ పాత్ర నిజంగా హీరోలాగా ఉంటుంది,” అని అన్నారు. ప్రయోగాత్మక పాత్రలవైపు ఆకర్షితులయ్యే తన తత్వాన్ని వెల్లడిస్తూ, “నిన్నే పెళ్లాడతా” తర్వాత “అన్నమయ్య” వంటి విభిన్నమైన పాత్రలు చేశానని, అలాంటి ప్రయోగాల్లో విజయాలు, పరాజయాలూ రెండూ ఎదురయ్యాయని గుర్తు చేశారు.
ఒకసారి దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తనను కలిసి, “మీరు విలన్ పాత్ర చేయగలరా? లేకపోతే టీ తాగి వెళ్లిపోతాను” అన్నట్లు చెప్పారు. అప్పటికే “ఖైదీ” సినిమాతో లోకేశ్ ప్రతిభను గుర్తించిన నాగార్జున, కథ విని సైమన్ పాత్రలో ఆసక్తి కలిగిందని తెలిపారు.
“ఈ పాత్ర కోసం నేను ఆడియో రికార్డ్ కూడా చేసుకున్నాను. కొన్ని మార్పులతో దర్శకుడు పాత్రను అభివృద్ధి చేశాడు. సెట్లో లోకేశ్ చాలా ప్రశాంతంగా ఉంటారు,” అని పేర్కొన్నారు.