Nagababu

Nagababu: పవిత్ర తిరుమల క్షేత్రాన్ని కూడా వదలలేదు.. వైసీపీపై నాగబాబు ఫైర్

Nagababu:  తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నాసిరకం నెయ్యి, జంతు కొవ్వు వినియోగించారనే ఆరోపణల నేపథ్యంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో హిందూ ధర్మానికి, భక్తుల విశ్వాసాలకు పెద్ద ఎత్తున ద్రోహం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జగన్‌ను “హిందూ ద్రోహి”గా అభివర్ణిస్తూ, వైసీపీ నాయకులు భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని మండిపడ్డారు.

పూర్వకాలంలో మంత్రాలకు చింతకాయలు రాలతాయని లేదా నీటితో దీపాలు వెలిగించారని అంటే మనం నమ్మేవాళ్ళం కాదని, కానీ జగన్ బాబా మాత్రం పాలు, వెన్న లేకుండానే నెయ్యిని తయారు చేసి అద్భుతం చేశారని నాగబాబు ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని, అర్హత లేని కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు. దొంగ డెయిరీలుగా నమోదైన సంస్థల నుండి సేకరించిన ప్రమాదకరమైన కెమికల్స్ జంతు కొవ్వు కలిసిన నూనెతో లడ్డూలను తయారు చేయడం అత్యంత దారుణమని ఆయన పేర్కొన్నారు.

సిట్ (SIT) దాదాపు ఏడాదిన్నర పాటు విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టిందని నాగబాబు వెల్లడించారు. సుమారు 60 లక్షల కేజీల నకిలీ నెయ్యిని టీటీడీ నిధులతో కొనుగోలు చేసి, భక్తులకు విషపూరితమైన ప్రసాదాన్ని పంపిణీ చేశారని ఆయన ధ్వజమెత్తారు. నాణ్యమైన భోజనం పెడతామని డబ్బులు వసూలు చేసి, నకిలీ సరుకులతో మోసం చేసే వారిని ఏమంటారో అందరికీ తెలుసని, వారిని ‘వైసీపీ నాయకులు’ అని పిలవాలని ఆయన సెటైర్లు వేశారు. ప్రభుత్వ సొమ్మును అవినీతితో దోచుకోవడమే కాకుండా, పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని కూడా వదలకుండా అపవిత్రం చేయడం క్షమించరాని నేరమని నాగబాబు తన వీడియోలో స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *