ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది. అయితే ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ చేయబోయే సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. చాలా కాలం క్రితమే త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
కానీ తాజాగా నిర్మాత నాగ వంశీ అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. “అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా మా బ్యానర్ లోనే త్రివిక్రమ్ తోనే ఉంటుంది. ఓ పాన్ ఇండియా సబ్జెక్టుని త్రివిక్రమ్ తయారు చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. చాలా పెద్ద కథ అది. ఓ జానర్ అని లేదు.. నేను ఇంకా త్రివిక్రమ్ ని కథ అడగలేదు.. ఆయన్ని డిస్టర్బ్ చేయొద్దు అనుకున్నాను. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా ఉంటుంది” అని తెలిపారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఇప్పట్నించీ త్రివిక్రమ్ – బన్నీ సినిమాపై అంచనాలు పెట్టుకుంటున్నారు.
గతంలో త్రివిక్రమ్ – బన్నీ కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. వీరిద్దరు హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఇప్పుడు నాలుగోసారి రాబోతుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉంటాయి. కాగా, త్రివిక్రమ్ తర్వాత అల్లుఅర్జున్ తన తర్వాతి చిత్రాలను బోయపాటి, అట్లీ, సందీప్ రెడ్డి వంగ తోపాటు పలువురు డైరెక్టర్స్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం.